వేములవాడ రూరల్, జనవరి 5: మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాలనలో ఫెయిల్ అయిందని, ఈ రెండేండ్లలో చేసింది శూన్యమని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు విమర్శించారు. బీఆర్ఎస్పై రోజురోజుకూ ప్రజల్లో భరోసా కలుగుతున్నదని, కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, అందుకు చేరికలే నిదర్శనమని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ మండలం రుద్రవరంలో సోమవారం గ్రామానికి చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పటిష్టంగా ఉందన్నారు. కేసీఆర్‌తోనే ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కాగా, కాంగ్రెస్‌కు చెందిన తిరుపతి, మల్లేశం, రాజిరెడ్డి, నరేశ్, బాలయ్య, రవి, నర్సయ్య, కనుకయ్య, అంజయ్య, రాజనర్సు, మల్లయ్య, రమేశ్, అనిల్, మధుతో పాటు 50 మంది పార్టీలో చేరారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్‌రావు, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు హరికృష్ణ, సర్పంచ్ ఊరడి సునీతరాజిరెడ్డి, ఉపసర్పంచ్ బెజుగం మహేశ్, వార్డు సభ్యులు అలిపిరి సురేశ్, తాడెం లచ్చయ్య, మహేందర్‌రెడ్డి, రాజు, శ్రీనివాస్, తిరుపతి, నరేశ్, లచ్చయ్య ఉన్నారు.