ఖైరతాబాద్, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలోని పేద విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని, గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యారులు చనిపోతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిల పక్ష పార్టీలు, విద్యార్థి, మేథావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,800 కళాశాలల్లో 12.50లక్షల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, 1.56లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందిగా పనిచేస్తున్నారని.. అయితే ఐదు నెలలుగా బోధకులకు జీత భత్యాలు లేవన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ రాకపోడంతో యాజామాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండేండ్ల కాలంలో రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎలాంటి ఉద్యమాలకైనా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.
పిల్లల చదువులకు పైసలు పుట్టడం లేదా..?
రెండు సంవత్సరాల ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో రూ.2లక్షల కోట్లు అప్పుతెచ్చుకున్నారని, పిల్లల చదువులకు మాత్రం పైసలు పుట్టడం లేదా అని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.40వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, అవి పేద వర్గాల పన్నుల ద్వారా వస్తున్నాయని.. వాటిని విద్య కోసం ఎందుకు వెచ్చించడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు నిధులను విడుదల చేయాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌తో బతుకులు బాగుపడుతాయని, ఏదో ఉద్దరిస్తారని ఓట్లు వేసి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటే బీసీ బిడ్డలను కాటికి పంపుతున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, కవి, రచయిత జూలూరు గౌరీ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 160 మంది బడుగుల పిల్లలు చనిపోయారన్నారు. ఇవన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అన్నారు. గురుకులాల్లో నాసిరకమైన భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ విఠల్, ప్రొఫెసర్ సంఘాని మల్లేశ్వర్, రాష్ట్ర కార్య నిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.