Ration Cards | హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు.ఈ ప్రకటనలో పేర్కొన్న విషయాలు.. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలి. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలి.