గోదావరిఖని, జనవరి 5: నమ్మించి ముంచడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. సోమవారం గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలోని ఓ ఫంక్షన్హల్లో జరిగిన రామగుండం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరై, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అబద్ధాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలంతా అస్యహించుకుంటున్నారన్నారు.
నియోజకవర్గంలో రెండేండ్లుగా కూల్చివేతలు, కమీషన్లు తీసుకోవడం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలకు దినచర్యగా మారిందని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా మోసపూరిత పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మన ఎజెండా.. మనలక్ష్యం రామగుండం మేయర్ పీఠమని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రోజుకో డివిజన్ చొప్పున బస్తీబాట ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజలను జాగృ తం చేయాలని, గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, రెండేళ్లలో కాంగ్రెస్ కూల్చివేతలు, విధ్వంసాలను వివరించాలని సూచించారు.
పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని, పార్టీని కించపరిచేలా ఎవరైనా పోస్టులు పెట్టినా, మాట్లాడినా వెంట నే తిప్పికొట్టాలన్నారు. అనంతరం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులను చందర్ సన్మానించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు మూల విజయారెడ్డి, కౌశికహరి, మిర్యాల రాజిరెడ్డి, పర్లపల్లి రవి, నారాయదాణదాసు మారుతి, మురళీధర్‌రావు, గోపు ఐలయ్యయాదవ్ పాల్గొన్నారు.