Vishwambara | మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే కాదు, టాలీవుడ్ సీనియర్ హీరోల చిత్రాల్లోనూ భారీ వసూళ్లు సాధించిన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పుడు అందరి చూపు ఆయన తదుపరి చిత్రం ‘విశ్వంభర’ పైనే నిలిచింది. చిరంజీవి కెరీర్‌ను పరిశీలిస్తే, కొన్ని పరాజయాల తర్వాత భారీ హిట్లతో తిరిగి బలంగా నిలబడటం ఆయనకు కొత్త కాదు. ‘మృగరాజు’ తర్వాత వచ్చిన ఇంద్ర ఇండస్ట్రీ రికార్డులు సృష్టించగా, వెంటనే వచ్చిన ఠాగూర్ కూడా ఘన విజయం సాధించింది. అదే తరహాలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ తర్వాత ‘విశ్వంభర’ కూడా విజయపథంలో నడుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే ‘విశ్వంభర’ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ చిత్రం ముందుగానే పూర్తయినా, 2025 సంక్రాంతికి విడుదల కాలేదు. పలు కారణాల వలన ప్లాన్ వాయిదా పడింది. అప్పట్లో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కోసం విడుదలను మార్చినట్టు సమాచారం. అనంతరం గ్రాఫిక్స్ పనులను మరింత మెరుగుపరచాలని నిర్ణయించడంతో సినిమా మళ్లీ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో గతంలో గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమైన అంజి ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయిందనే చర్చ కూడా వినిపిస్తోంది. అయితే ఈసారి పరిస్థితి భిన్నమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ‘విశ్వంభర’కు దర్శకత్వం వహిస్తున్న మల్లిడి వశిష్ఠ తన తొలి చిత్రం బింబిసారతో విజువల్ ట్రీట్మెంట్లో తన సత్తా చాటుకున్నారు. యువ దర్శకుడిగా నూతన తరానికి నచ్చేలా, మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాను తీర్చిదిద్దారని విశ్వసిస్తున్నారు.
ప్రస్తుతం ‘విశ్వంభర’ను జూలై 10న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే తేదీన 2015లో విడుదలైన బాహుబలి: ది బిగినింగ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అదే మ్యాజిక్ ‘విశ్వంభర’ విషయంలోనూ పునరావృతం అవుతుందనే ఆశ అభిమానుల్లో ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ విజయోత్సాహంలో ఉన్న అభిమానులు ఇప్పుడు ‘విశ్వంభర’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలు బాక్సాఫీస్ వద్ద నిజమవుతాయా? జూలై 10 సమాధానం చెప్పనుంది.