Supreme Court : ఎన్నికల్లో గెలువని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బీహార్ ప్రభుత్వాన్ని (Bihar Govt) సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి (Bihar Panchayati Raj Minister) దీపక్ ప్రకాశ్ (Deepak Prakash) ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా ఆ పదవిలో కొనసాగించడంపై సమాధానం చెప్పాలని సమ్రాట్ చౌధరీ (Samrat Chaudhary) ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
సాధారణంగా ఎన్నికల్లో గెలువని వ్యక్తులు రాష్ట్ర మంత్రులుగా నియమితులైతే.. వారు ఆరునెలల్లోగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలువాల్సి ఉంటుంది. లేదా శాసనమండలి సభ్యుడిగానైనా ఎన్నిక కావాలి. కానీ దీపక్ ప్రకాశ్ 2025 నవంబర్లో పంచాయతీ రాజ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తొలుత ఏప్రిల్ 25, 2026 వరకు మంత్రిగా కొనసాగారు. అప్పుడు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో క్యాబినెట్ మొత్తం రద్దయ్యింది.
తర్వాత సమ్రాట్ చౌధరీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. దీపక్ మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మధ్యలో 22 రోజులు ఏ పదవిలో లేరు. అంటే నిరవధికంగా ఆరు నెలలపాటు దీపక్ మంత్రిత్వ బాధ్యతల్లో లేనట్లయ్యింది. సాధారణంగా ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని కోల్పోతారు. కానీ ఇక్కడ ఒకే మంత్రి విషయంలో ఆరు నెలల గడువును రెండుసార్లు వినియోగిచడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
దీపక్ ఎన్నికల్లో గెలువకపోయినా ఆయనను రెండోసారి మంత్రిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది రాజ్యంగాన్ని మోసం చేయడమే అవుతుందని, మంత్రి పదవి కేటాయింపు చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చట్టాన్ని ప్రశ్నించడమే అవుతుందని, ఎన్నిక కాకుండా ఒక మంత్రిని ఆరునెలలకు పైగా ఎలా కొనసాగిస్తున్నారనే దానిపై సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదావేసింది.
ఇదిలావుంటే ప్రమాణస్వీకారం సమయంలో కూడా దీపక్ వార్తల్లో నిలిచారు. ప్రముఖ రాజకీయ నాయకులంతా కుర్తా, పైజామా, ధోవతీలతో రాగా.. దీపక్ మాత్రం చాలా డిఫరెంట్లుక్లో కనిపించి అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు. క్యాజువల్ షర్ట్, ప్యాంట్ ధరించిన ఆయన.. అదే వేదికపై ఉన్న ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుశ్వాహా కుమారుడే ఈ దీపక్. ఆయన తల్లి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.