Actor Srikanth | ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వరుస విజయాలు అందుకున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్, ప్రస్తుతం హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సత్తా చాటుతున్నారు. ఇటీవలే ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆబ్జెక్షన్ మై లార్డ్ అంటూ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రీకాంత్ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, నాటి అనుభవాలు, అప్పట్లో ఎదుర్కొన్న పోటీపై మనసు విప్పి మాట్లాడారు.
కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా ఎదిగిన శ్రీకాంత్.. ఇప్పుడు తన కుమారుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో తాను పూర్తిగా విలన్, క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లినట్లు తెలిపారు. మనం అద్దంలో చూసుకున్న తర్వాత మన పరిమితులు ఏంటో మనకు తెలిస్తే లైఫ్‌ను ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హీరోగా రేసులో ఉండటం కంటే విభిన్నమైన పాత్రలు, యాంటీ హీరో రోల్స్ చేయడం చాలా సరదాగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ ఉండదు అని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఇండస్ట్రీలో పోటీ గురించి మాట్లాడుతూ.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో తమను తాము ఎప్పుడూ పోల్చుకోలేదని, తమకంటూ ఒక ప్రత్యేకమైన కుటుంబ కథా చిత్రాల జోనర్ ఉండేదని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనతో పాటు జగపతి బాబు కూడా ఫ్యామిలీ సబ్జెక్టులతో బిజీగా ఉండేవారని, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఎక్కువగా తమతోనే సినిమాలు చేసేవారని చెప్పారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాలు మిస్సయ్యామని, అలా ఒకసారి తాను వదిలేసిన సినిమా పెద్ద హిట్ అయిందని పాత జ్ఞాపకాలను నెరుకువచ్చారు.
అలాగే తన కెరీర్లో మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ మినహా దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నానని శ్రీకాంత్ తెలిపారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి యంగ్ జనరేషన్ హీరోలతోనూ కలిసి పనిచేశానని, భవిష్యత్తులో మిగిలిన యువ హీరోలతోనూ నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఇక హెయిర్ స్టైల్స్, గెటప్‌ల గురించి చెప్తూ.. గతంలో ఫ్యామిలీ మూవీస్‌లో గెటప్స్ మార్చే ట్రెండ్ లేదని, కానీ ఇప్పుడు కాలం మారుతున్న నేపథ్యంలో ‘అఖండ’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన గెటప్‌లను ట్రై చేశానని చెప్పారు. కన్నడ పవర్‌స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ చిత్రంలో తాను చేసిన ఫ్యామిలీ విలన్ పాత్ర తనకు మంచి సంతృప్తినిచ్చిందని శ్రీకాంత్ వెల్లడించారు.