ఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పంటలను కొనుగోలు చేయడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో సోయా కొనుగోలు చేయాలంటూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీగా వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. పంట కొనుగోళ్లలో కమిటీ వేసినా ఫలితం లేదని సభ్యులు సిఫారుసు చేసిన పంటను మార్క్ఫెడ్ అధికారులు తిప్పి పంపుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 20 శాతం సోయాను కేంద్రం కొనుగోలు చేస్తే 80 శాతం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో సేకరించిందని గుర్తు చేశారు. యూరియా యాప్ను రద్దు చేయాలని, యాసంగికి రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులను మభ్యపెడుతున్నారు..
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కోటా 25 శాతం సోయాబిన్ కొనుగోళ్లు పూర్తయిందని, పంట కొనుగోళ్ల విషయంలో తాము ఏమీ చేయలేని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్ రావు అన్నారని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోయాబిన్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకి సోయాను కొనుగోలు చేయాలంటూ రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ఎమ్మెల్యే నాటాకాలు మానుకొని సోయా కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఆదిలాబాద్ ఎంపీ పలు సమస్యలు విషయంలో వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలుస్తున్నా రైతుల సమస్యల విషయంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని ఎందుకు కలువడం లేదని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు ఆదిలాబాద్ పట్టణ బంద్
సోయాబిన్ కొనుగోళ్లు, రైతుల ఇతర సమస్యల పరిష్కారంలో భాగంగా నేడు(మంగళవారం) ఆదిలాబాద్ పట్టణబంద్ను నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. వ్యాపారులు, కార్మికులు, పట్టణ ప్రజలు బంద్కు సహకరించాలన్నారు. ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యానిస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, విజ్జిగిరి నారాయణ, అలాల అజయ్, సాజిదొద్దిన్, ధమ్మపాల్, లింగారెడ్డి, ప్రమోద్ రెడ్డి, మార్సెట్టి గోవర్ధన్ పాల్గొన్నారు.