ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నది. ఐదు రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. యుద్ధంతో భారత్ చమురు దిగుమతులకు ముప్పు ఏర్పడే ప్రమాదం కనిపిస్తున్నది. అంతేకాకుండా గల్ఫ్ దేశాలకు ఆర్థిక నష్టాలు, అమెరికా ప్రతిష్ఠకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌తోపాటు పశ్చిమాసియాలోని ఆర్థిక వ్యవస్థలు, ప్రజల రోజువారీ జీవితాలను సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్నది. అమెరికాకు చెందిన మాజీ సైనికాధికారి, విదేశాంగ నిపుణుడు కల్నల్ డగ్లస్ మాక్ గ్రెగార్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. చమురు సరఫరా మార్గాల్లో అంతరాయల వల్ల వాటి ధరలు విపరీతంగా పెరిగి, దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.
అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తున్నది. ఇప్పటికే టర్కీ నుంచి దుబాయి వరకు అమెరికాకు చెందిన సైనిక స్థావరాలు, పోర్టులు, చమురు శుద్ధి కేంద్రాలు, విమానాశ్రయాలు ఇలా 27 ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ల ద్వారానే జరిపినట్టు తెలిసింది. రవాణా మార్గాలపై ఈ దాడులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యూరప్‌లో చమురు ధరలు బ్యారెల్‌కు 20 డాలర్లు పెరిగి 80 డాలర్లకు చేరింది. హోర్మోజ్ జలసంధి కూడా మూతపడితే 100 డాలర్లకు కూడా చేరే ప్రమాదం పొంచి ఉన్నదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దుబాయి, సౌదీ అరేబియా కూడా తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయాయి. ఇరాన్ వినియోగిస్తున్న ఆధునిక ఆయుధాలను దుబాయి, సౌదీ అరేబియా బలహీనమైన రక్షణ వ్యవస్థలు దీటుగా ఎదుర్కోలేకపోతున్నాయి. పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిలిపివేశాయి. దుబాయిలోని 50 లక్షల మంది భారతీయులపైనా ప్రభావం పడుతున్నది.
ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం
సూయీజ్ కాలువ, ఎర్ర సముద్రం నౌకాయానానికి తీవ్ర అంతరాయం కలుగుతున్నది. దీంతో ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడుతున్నది. ఈ మార్గాల్లో భారత్ రోజుకు 26 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ బ్యారెల్‌కు 10 డాలర్ల చొప్పున పెరిగితే, మొత్తం 15 బిలియన్ డాలర్ల అధిక వ్యయం అవుతుంది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) ఉత్పత్తిని పెంచవచ్చు. కానీ దీర్ఘకాలిక యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉన్నది.
అమెరికాపై ప్రతికూల ప్రభావం
ఉక్రెయిన్‌కు పెద్దఎత్తున క్షిపణులు పంపినందున అమెరికా వద్ద ప్రస్తుతం 4,000 క్షిపణులు మాత్రమే ఉన్నట్టు ఒక అంచనా. అమెరికాకు చెందిన కొన్ని పోర్టులు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పుడు క్షిపణులను సరఫరా చేసుకోవాలంటే భారత్ వంటి దూర దేశాల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధం అమెరికాకు కష్టతరంగా, ఖరీదైనదిగా మారుతున్నది. అమెరికాలో అంతర్గతంగా కూడా ప్రభావం కనిపిస్తున్నది. చమురు ధరలు పెరగడంతో వాల్‌స్ట్రీట్ 800 పాయింట్లు పడిపోయింది. పెట్రోల్, ఆహారం సహా అన్నింటి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చమురు కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టవచ్చు. కానీ ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఈ యుద్ధం వల్ల జపాన్ వంటి ఆసియా దేశాలు అమెరికాపై నమ్మకం కోల్పోయి డాలర్‌కు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
అమెరికా నుంచి పూర్తి అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ యుద్ధంలోకి దిగిందనే విశ్లేషణలు కొందరు చేస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఇరాన్ నకిలీ క్షిపణులు, వేగవంతమైన ఆయుధాలతో ఎదుర్కొంటున్నది. దీంతో ఇజ్రాయెల్ బలం సరిపోవడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ లక్షమంది సైనికులను మోహరించింది. గాజా, లెబనాన్ ప్రాంతా ల్లోనూ యుద్ధం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్‌పై భారీగా ఒత్తిడి పడుతున్నది. ప్రస్తుతానికి గల్ఫ్ పెట్టుబడిదారులు ఇజ్రాయెల్‌కు నిధులను మళ్లించవచ్చు. కానీ ఇవే పరిస్థితులు ధీర్ఘకా లికంగా కొనసాగితే వ్యాపారాలు మూతపెట్టి, దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితులు రావొచ్చు.
ఇరాన్ బలాబలాలు
ఇరాన్ ప్రజలు తమ అత్యున్నత నాయకుడిని కోల్పోయారు. ఇరాన్ సైనిక కేంద్రాలపై అమెరికా 1,700 దాడులు చేసింది. ఇరాన్ వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తున్నది. పర్షియన్ నాగరికతకు చెందిన దీర్ఘ చరిత్ర కారణంగా ప్రజలు ఐక్యంగా నిలుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ దేశంలో పెద్దగా కల్లోలం కనిపించడంలేదు. రష్యా, చైనా మద్దతుతో యుద్ధంలో నిలువగలిగితే ఇరాన్‌కు అదే పెద్ద విజయం అవుతుంది.
పశ్చిమాసియాలో మార్పులు
ప్రస్తుత యుద్ధం కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్ కాలంలో రూపొందించిన పాత సరిహద్దులు కూడా మారిపోయే అవకాశం ఉన్నది. సంక్షోభంగా కారణంగా గల్ఫ్ రాజ్యాల్లో నిరుద్యోగం పెరిగితే ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతుంది. అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని ఇరాక్‌లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడుల పట్ల టర్కీ సంతోషంగానే ఉన్నదని కొందరు భావిస్తున్నారు. యుద్ధ వాతావరణంలో యూరప్ మాటలకే పరిమితమైందని విమర్శలు ఎదుర్కొంటున్నది. భారత్ చౌకైన రష్యా చమురుపై ఆధారపడుతున్నది. చైనా తన వాణిజ్య మార్గాలను, నౌకాశ్రయాలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
అసలేం జరుగబోతున్నది?
బాంబులు వేయడం తప్ప అమెరికాకు స్పష్టమైన వ్యూహం ఉన్నట్టుగా కనిపించడంలేదు. ఇరాన్ దీర్ఘకాల పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం చూస్తుంటే గతంలో ఇరాక్ యుద్ధంలో జరిగిన తప్పులను మళ్లీ గుర్తుకుతెస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌కు పర్షియన్ దేశాలతో పాత సంబంధాలు ఉన్నందున శాంతి చర్చలకు సహాయం చేసే అవకాశం ఉన్నది. కానీ దాడులు ఆగే వరకు చర్చలు ఉండబోవని ఇరాన్ చెప్తున్నది. అమెరికాకు దేశీయంగా చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉండటం కొంత ఉపశమనం కావొచ్చు. కానీ ఇరాన్ బలాన్ని పట్టించుకోకపోతే ఇది ఇరాక్ యుద్ధంలా పెద్ద తప్పుగా మారే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఈ యుద్ధంలో అణ్వాయుధాల వినియోగం జరిగినా, రష్యా, చైనా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగినా అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోవడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాల శాంతికి ఒకరినొకరు అంగీకరించే కొత్త వ్యవస్థ అవసరం.
సుక్కన్న