Manipur : మణిపూర్‌లో దారుణం జరిగింది. ఆయుధాలతో వెళ్తున్న ఒక వాహనంపై తుపాకులు కలిగిన దుండగులు దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాహన డ్రైవర్ మరణించాడు. ఈ ఘటన మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలోని నేషనల్ హైవే 202పై, లీయింగాంగ్చింగ్, టీఎస్ కసోమ్ ప్రాంతాల మధ్య శుక్రవారం జరిగింది. నాగా, కుకీ తెగల మధ్య గతంలో అనేకసార్లు ఘర్షణలు జరిగిన ప్రాంతంలోనే ఈ దాడి జరిగింది.
ఇది సమస్యాత్మకమైన ప్రాంతం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుధాలతో వెథ్తున్న ఒక ట్రక్కుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. చేతిలో తుపాకులు, గన్స్ వంటి ఆయుధాలతో కాల్పులు జరపడంతో ట్రక్కు డ్రైవర్ మరణించాడు. అతడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి పోలీసులకు, భద్రతా బలగాలకు, దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఇంఫాల్‌లోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కాల్పులకు పాల్పడింది ఎవరు అనే విషయం ఇంకా తెలియరాలేదు. దీంతో దండగుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ ఘటనపై మణిపూర్ సీఎం యుమ్నామ్ కెంచంద్ సింగ్ స్పందించారు. ఈ దాడిని ఖండించారు. దీన్ని తీవ్రమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన కానిస్టేబుల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.