బోస్టన్, ఆగస్టు 13: అమెరికాలో భారత సంతతి యువకుడు తన తల్లిని, 14 ఏండ్ల తమ్ముడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బోస్టన్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఆక్టన్‌లోని ఒక ఇంట్లో 17 ఏండ్ల అర్జున్ అరవింద్, తన తల్లి, తమ్ముడిపై అత్యంత పాశవికంగా దాడి చేసి, హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.
మంగళవారం మసాచుసెట్స్ సబర్బన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 45 ఏండ్ల సుధా వెంకటేశన్, 14 ఏండ్ల సిద్ధార్త్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. ప్రధాన నిందితుడు అర్జున్ అరవింద్..హత్యాకాండకు ముందు కుటుంబ సభ్యులను చంపటం గురించి ‘కిల్ ఫ్యామిలీ’ కల్పిత కథలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, చాట్‌జీపీటీలో సెర్చ్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.