హైదరాబాద్, మార్చి7 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ హాస్టళ్లలో పలువురు వార్డెన్లు ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. ఉన్నతాధికారులు సైతం అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. వార్డెన్లు, అధికారులు కుమ్మక్కై నిధులను స్వాహా చేస్తున్నారని తెలుపుతున్నారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
డైట్ నిధుల్లో వాటాలు
సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులందరికీ కామన్ డైట్‌ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు నిర్ణయించింది. అయితే ఇప్పటికీ ప్రీ, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో కామన్ డైట్ అమలు కావడం లేదు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. వార్డెన్లు, పలువురు ఉన్నతాధికారులు కు మ్మక్కై నిధులను స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1500 నుంచి రూ.2100కు, గురుకుల హాస్టళ్లలో 3-7వ తరగతి విద్యార్థుల మెస్‌చార్జీలను రూ.900 నుంచి రూ.1330కి, 8-10వ తరగతి విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540కి పెంచింది.
ఆ మేరకు బిల్లులు చెల్లిస్తున్నది. అయితే వసతి గృహాల్లో మాత్రం పాత డైట్‌నే అమలు చేస్తున్నారు. కానీ పెంచిన రేట్లతోనే మెస్ బిల్లులు తెచ్చుకుంటున్నారు. విద్యార్థుల పొట్టగొడుతూ ఆ నిధులను వార్డెన్లు కైంకర్యం చేస్తున్నారు. పెంచిన డైట్ చార్జీలకు అనుగుణమైన మెనూను రూపొందించి అమలు చేయడం లేదు. పాత మెనూనే అమలు చేస్తూ నిధులను జేబుల్లోకి నింపుకుంటున్నారు. బీసీ, ఎస్సీ సంక్షేమశాఖకు చెందిన జిల్లాస్థాయి మొదలు పలువురు ఉన్నతాధికారుల వరకూ వాటాలు ముట్టజెప్తున్నామని పలువురు వార్డెన్లు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. విద్యార్థులకు మెరుగైన భోజనం అందకుండా పోతుండగా, మరోవైపు ప్రభుత్వ ఖజానాకు భారీగా బొక్క పడుతున్నదని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు వివరిస్తున్నాయి.
వార్డెన్లు.. ఉన్నతాధికారులు కుమ్మక్కు!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ హాస్టల్‌ను స్థానిక జిల్లా కలెక్టర్ ఇటీవల సందర్శించారు. హాస్టల్లో కనీస వసతులు లేకపోవడంతోపాటు, మెనూ కూడా అమలుచేయడం లేదని గుర్తించారు. ఆ హాస్టల్ వార్డెన్‌ను కలెక్టర్ స్వయంగా సస్పెండ్ చేశారు. కానీ కేవలం 15 రోజుల్లోనే ఆ వార్డెన్‌ను తిరిగి నియమించాలని బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు కలెక్టర్‌కు సిఫార్సు చేయడం గమనార్హం. అదీగాక వాస్తవంగా సస్పెన్షన్ గ్యాప్ పీరియడ్‌ను సెలవుగా పరిగణిస్తారు. కానీ సదరు వార్డెన్‌కు పూర్తి జీతం ైక్లెయిమ్ చేసేలా ఉన్నతాధికారులు సహకరించడం కొసమెరుపు. గతంలోనూ సదరు వార్డెన్ ఓ సారి సస్పెన్షన్‌కు గురయ్యారు.
అప్పుడు కూడా ఎలాంటి ఆదేశాలు లేకుండానే సస్పెన్షన్ కాలాన్ని ఈఎల్గా ఉన్నతాధికారులు క్రమబద్దీకరించారు. ఇప్పుడు సదరు వార్డెన్ ఏకంగా జిల్లా స్థాయి పోస్టు కోసం సంక్షేమ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం కొసమెరుపు. వార్డెన్లకు, బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారుల అండదండలు ఏ రీతిలో కొనసాగుతున్నాయో తెలిపేందుకు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వార్డెన్లు, జిల్లా బీసీ సంక్షేమ అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు పలువురు మొత్తంగా ఒక బృందంగా ఏర్పడి నిధులను స్వాహా చేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తక్షణం స్పందించి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాయి.