సిలిగురి, న్యూఢిల్లీ: ఉత్తర బెంగాల్లో తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్న అంతర్జాతీయ ఆదివాసీ సమావేశానికి అనుమతి నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంథాల్ సమావేశం వేదికను బిద్ధానగర్ నుంచి గోషాయ్పూర్కు మార్చడాన్ని ఆమె ప్రశ్నించారు.
తనపట్ల మమతా బెనర్జీ అసంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించిన రాష్ట్రపతి.. తనకు స్వాగతం పలికేందుకు మమత కాని, మంత్రులు కాని ఎవరూ రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సిలిగురి సందర్శన సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తనకు కల్పించాల్సిన ప్రొటోకాల్, ఏర్పాట్లలో కూడా లోపాలు జరిగినట్లు వెల్లడించారు. అయితే ఇందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎలాంటి కోపం లేదని రాష్ట్రపతి అన్నారు. మమతను సోదరిగా ఆమె సంబోధించారు.
బెంగాల్లో జరిగిన పరిణామాన్ని సిగ్గుచేటు, అసాధారణంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మమత ప్రభుత్వం అన్ని హద్దులను దాటిందని, రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానానికి ప్రభుత్వ పాలకులు బాధ్యత వహించాలని మోదీ స్పష్టం చేశారు.
రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదన్న విమర్శలపై బెంగాల్ సీఎం మమత స్పందించారు. రాష్ట్రపతి తన పదవి ఔన్నత్యానికి తగని విధంగా ప్రకటనలు చేయవద్దని అభ్యర్థించారు. ‘మీరు ఒక కులం గురించి నేడు మాట్లాడారు. బెంగాల్లోని ఇతర కులాల గురించి మీరు మాట్లాడలేదు. రాజకీయాలు ఎలా చేయాలో మీకు తెలుసు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం మా ప్రభుత్వం చేసిన కృషిని మీకు వివరిస్తాం’ అని ఆమె తెలిపారు.