ఎల్బీనగర్, జూలై 26: కాక్రోచ్ జనతాపార్టీ స్ఫూర్తితో రాష్ట్రంలో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పురుడుపోసుకోనున్నది. “మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కాదు” అంటూ ఇటీవల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం తరహాలోనే సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్యమించేందుకు నిరుద్యోగులు సమాయత్తమవుతున్నారు. ఎండ్రిన్ తాగి చావండి అన్న నోర్ల్లే రేపు నిరుద్యోగుల సత్తా చూసి నోరెళ్లబెడుతాయని తెలంగాణ ఎండ్రిన్ పార్టీకి రూపకల్పన చేస్తున్న పోలీస్ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పార్టీ ప్రధాన ప్రతినిధులుగా నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, ఆకాశ్ నవీన్ పట్నాయక్, శంకర్, కుమార్‌నాయక్, శింబు, వంశీ, చెర్రి ప్రవీణ్, సోమేశ్, జీ ప్రవీణ్ ఉంటారని తెలిపారు. పోలీస్ విభాగంలో 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి అధికారికంగా పార్టీని ప్రారంభిస్తామని ఇంద్రానాయక్ తదితరులు పేర్కొన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండ్‌తోనే తమ పోరాటం సాగుతుందని చెప్పారు.
తెలంగాణ ఎండ్రిన్ పార్టీని రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట వేదికగా ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు తెలిపారు. సూర్యాపేటలోని మారోజు వీరన్న స్థూపం వద్ద పార్టీ లోగోను ఆవిష్కరించడంతో పాటు తొలి బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు ఇచ్చారని, కానీ తెలంగాణలో 50 రోజులుగా పోరాటం చేస్తున్న నిరుద్యోగుల గోస మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోవాలని, లేదంటే ధర్మేంద్ర ప్రధాన్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.