హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ఈ వాయుగుండం సోమవారం పారాదీప్-సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో 31వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతోపాటు కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా, జూలైలో రాష్ట్రంలో 43% లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. సాధారణ సగటు వర్షపాతం 227.4 మి.మీ కురువాల్సి ఉండగా, 109.7 మి.మీ కురిసిందని తెలిపింది.