Puri Jagannadh | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టుతో అభిమానులకు తెలియజేశారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. తన నానమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పవిత్ర ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోతో పాటు ఆమె రాసిన ఎమోషనల్ సందేశం అందరి హృదయాలను కదిలిస్తోంది.ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెడతారు? నీతో మరో రోజు గడిపే అవకాశం వస్తే ఎంత బాగుండేది. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లే మరోసారి పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ అంటూ పవిత్ర తన మనసులోని బాధను వ్యక్తం చేశారు.
పవిత్ర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు పూరీ జగన్నాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. నానమ్మతో పవిత్రకు ఉన్న అనుబంధాన్ని చూసి పలువురు నెటిజన్లు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబానికి ఈ కష్ట సమయంలో అభిమానులు అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇక పూరీ జగన్నాథ్ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిస్తున్న ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పూరీ కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ సమయంలో పూరీ జగన్నాథ్ కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం సినీ వర్గాలను కూడా కలచివేసింది. అభిమానులు, పరిశ్రమకు చెందిన ప్రముఖులు పూరీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.