నిర్మల్ అర్బన్, జనవరి 5 : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిది. సరైన నాయకుడిని ఎంచుకొవడంలో ఓటు చాలా ప్రాముఖ్యమైంది. అలాంటి ఓటు స్థానిక వార్డుల్లో ఉండకుండా ఇతర వా ర్డుల్లో ఉంటే సరైన నాయకుడిని ఎంపిక ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతున్నది. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల కమిషనర్లు ఈనెల 1వ తేదీన పట్టణ ఓటరు ముసాయిదా విడుదల చేశారు. ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. ఒక వార్డులోని ఓట్లు మరొక వార్డులో నమోదు కావడం, ఇతర గ్రామాల ఓట్లు పట్టణాల్లో ప్రత్యక్షమవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇరుపార్టీల నేతలతోపాటు పట్టణ ప్రజలు తమ ఓట్లు స్థానిక వార్డులో ఉన్నాయా? ఇతర వార్డుల్లో ఉన్నాయా? అని తెలుసుకొనేందుకు మున్సిపల్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు.
తప్పుల తడకగా వార్డుల ఓట్లు
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాల్టీలలో ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉంది. ఇందులో ఆయా వార్డుల్లోని ఓట్లు ఇతర వార్డుల్లోకి మారాయి. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దాదాపు 500 ఓట్లు రవినగర్ కాలనీ, గొల్లపేట్, బుదవార్పేట్ వార్డులలో ఉన్నాయి. ఈ ఓట్లను తమ వార్డుల్లోకి బదలాయించాలని ఆశావహులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 40వ వార్డులో పట్టణ ఓటర్లు ఉండాల్సి ఉండగా ఆ వార్డుల్లోని ఓటర్లు పేర్లు లేక వారి స్థానంలో ఇతర గ్రామాలకు చెందిన ఓట్లను చేర్చుతూ జాబితాను విడుదల చేశారు. పట్టణంలోని మైనార్టీవాసులు ఉండే వార్డుల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఓటర్లు ఉన్నారంటూ ఫిర్యాదు చేశారు. స్థానిక దివ్యనగర్ కాలనీలో ఆ కాలనీ ఓటర్లకు బదులు కురన్నపేట్, షేక్ షా పేట్, గాజుల్పేట్, విద్యానగర్ కాలనీల ఓట్లు చేర్చారని, తమ వార్డు ఓటర్లకు బదులు ఇతర వార్డుల ఓట్లు చేర్చడమేమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
అయోమయంలో నేతలు, ఆశావహులు
మున్సిపల్ ఎన్నికల సందడి మొదలవగా మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో ఒక్కసారి రాజకీయ వేడి షురూ అయింది. ఇన్నాళ్లు కౌన్సిలర్లుగా ఉన్న మాజీలు మళ్లీ జనాల్లోకి రాగా… ఆశావహులు ఎన్నికల బరిలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ముసాయిదా జాబితా విడుదల కాగానే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఎంఐఎం పార్టీల నేతలు ముసాయిదా జాబితాతో తలలు పట్టుకుంటున్నారు. రిజర్వేషన్ల గురించి చర్చలు జరపాల్సిన నేతలు ఓటరు లిస్టును పట్టుకొని తమ వార్డు ఓటర్లు ఎక్కడున్నారంటూ జల్లెడపడుతున్నారు. తప్పుడు జాబితాను సవరించాలని అధికారులు ఫిర్యాదులు సమర్పిస్తున్నారు.
అభ్యంతరాలు స్వీకరిస్తున్న అధికారులు
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాల్టీలలో ఈనెల 1వ తేదీన ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఏవైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదులు అందించాలని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాల్టీలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణంలో సోమవారం వరకు 172, ఖానాపూర్‌లో 130, భైంసాలో 22 అభ్యంతరాలు వచ్చాయి.
సక్రమంగా సవరిస్తే సరే.. లేకుంటే అంతే సంగతి
మూడు మున్సిపాల్టీలలో తప్పుల తడకగా ఓటరు జాబితా ఉండగా వాటిని సవరించేందుకు నిర్మల్, భైంసా, ఖానాపూర్‌లలో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.అభ్యర్థుల వినతులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఇతర వార్డుల ఓట్లు, ఇతర గ్రామాల ఓటర్లను తీసివేసి స్థానికులు ఓట్లను జాబితాలో సక్రమంగా సవరిస్తే సరే.. లేకుంటే చాలా మంది ఆశావహులు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. అధికారులు జాబితాను సవరించి ఇటు ఓటర్లకు, అటు నేతలకు ఏ విధంగా సవరిస్తారో చివరి జాబితా వెలువడే వరకు వేచిచూడాల్సిందే.
సవరణ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి
ఖానాపూర్ టౌన్, జనవరి 5 : తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను సవరించిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఓటరు జాబితాలో అభ్యంతరాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం మున్సిపల్ కమిషనర్ సుందర్‌సింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయా పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని ఓటరు జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఒక వార్డు ఓట్లు మరో వార్డులో, ఇతర గ్రామాలకు చెందిన ఓటర్లను పట్టణ పరిధిలో నమోదు చేశారని పేర్కొన్నారు. తుది ఓటరు జాబితా పూర్తయ్యేలోపు బోగస్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, ఇతర గ్రామాలకు చెందిన ఓటర్లను తొలగించాలని కమిషనర్‌కు సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సుందర్‌సింగ్ మాట్లాడుతూ.. వివిధ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలు జిల్లా ఎన్నికల అధికారులకు పంపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు తాళ్లపల్లి రాజగంగన్న, గౌరికర్ రాజు, అబ్దుల్ ఖలీల్, కారింగుల సుమన్, తోట సుమిత్, సల్ల చంద్రహస్, నసీర్, షోయబ్, షఫీ పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణ ఓటర్ లిస్ట్ తప్పుల తడకగా ఉంది..
నిర్మల్ చైన్‌గేట్, జనవరి 5 : నిర్మల్ పట్టణ ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందని అన్ని పార్టీల నాయకులు అధికారులపై మండిపడ్డారు. సోమవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్క వార్డు ఓట్లు మరో వార్డులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరి పేరు రెండు, మూడు సార్లు నమోదయ్యాయన్నారు. అలాగే గుర్తు తెలియని పేర్లను ఓటర్ జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. ఓటర్ జాబితాను సవరించిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, బీఆర్ఎస్ నాయకులు మారుగొండ రాము, ఎంఐఎం నాయకులు అజీమ్బిన్, తౌహిద్ ఉద్దీన్ప్ప్రు, నాందేడపు చిన్ను పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాల్టీలలో 1,67,100 మంది ఓటర్లు ఉన్నారు.
నిర్మల్ పట్టణంలో 42 వార్డులు ఉండగా 98,295 ఓటర్లు ఉండగా ఇందులో 50,878 మంది మహిళలు, 47,399 పురుషులు, ఇతరులు 18 మంది ఉన్నారు.
భైంసాలో 26 వార్డుల్లో 51,118 ఉండగా, ఇందులో మహిళలు 25,623, పురుషులు 25,486, ఇతరులు 9 ఉన్నారు.
ఖానాపూర్‌లో 12 వార్డుల పరిధిలో 17, 693 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8524, మహిళలు 9169 ఉన్నారు.