Crop loss | రామన్నపేట : రామన్నపేట మండలంలో భూగర్భ జలాలు అడగంటి ఎండిపోయిన వరి పంటను ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 30 వేల రూపాయలు అందించి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు.
జనంపల్లి గ్రామంలో రైతు సంఘం నాయకులతో కలిసి నీరందక ఎండిన రైతు పండుగ రాజమల్లు వరి పంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామన్నపేట మండలంలో 28000 ఎకరాల వరి పంట వేస్తే ఇప్పటికి 800 ఎకరాల వరి పంటకు నీరందక ఎండిపోయాయని అన్నారు. సిరిపురం, వెల్లంకి, సర్నెనిగూడెం, కొమ్మాయిగూడెం, రామన్నపేట, జనంపల్లి, పిల్లిగూడెం గ్రామాల్లో ఇప్పటికే పంటలు ఎండుతున్నాయన్నారు.
వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. ఇంకా 10 రోజుల్లో ఎండలు ముదిరితే ఇంకా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతీ ఎకరాకు రైతుకు పెట్టుబడి 30వేల రూపాయల వరకు వస్తుందని అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆదుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య,రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కందుల హనుమంతు,గొరిగే సోములు, మేడి పృద్వి తదితరులు పాల్గొన్నారు.