Karakkaya | ఆయుర్వేదంలో త్రిఫలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్న సంగతి తెలిసిందే. త్రిఫలాలు అంటే.. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను త్రిఫలాలుగా పిలుస్తారు. ఈ మూడింటినీ సమ పాళ్లల్లో కలిపి తయారు చేసిన త్రిఫల చూర్ణాన్ని ఔషధంగా ఉపయోగిస్తుంటారు. అయితే త్రిఫలాల్లో ఒకటైన కరక్కాయను నేరుగా తీసుకోవచ్చు. దీన్ని త్రిఫల చూర్ణంలో భాగం చేయాల్సిన పనిలేదు. కరక్కాయను పొడి చేసి నేరుగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పలు రకాల వ్యాధులను తగ్గించేందుకు కరక్కాయ ఎంతగానో పనిచేస్తుంది. కరక్కాయను ఏ విధంగా ఉపయోగిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరక్కాయను తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కరక్కాయ జీర్ణక్రియను పెంపొందిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ సహజసిద్ధమైన డిటాక్సిఫైర్లా పనిచేస్తుంది. శరరీంలోని వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీని వల్ల అనేక రోగాల బారి నుంచి బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. కరక్కాయను తరచూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులు, క్రిములకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
కరక్కాయలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తీసుకుంటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా గౌట్ ఉన్నవారికి కరక్కాయ ఎంతగానో మేలు చేస్తుంది. ఆయా వ్యాధుల నుంచి బయట పడవచ్చు. కరక్కాయ మన శ్వాసకోశ వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. వాపుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. దీంతో ముక్కు దిబ్బడ కూడా తొలగిపోతుంది. కరక్కాయ మన హృదయ సంబంధ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె కండరాలు బలంగా మారుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
కరక్కాయ లివర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. లివర్ శుభ్రంగా మారేలా చేస్తుంది. దీన్ని తింటుంటే లివర్‌లోని వ్యర్థాల, టాక్సిన్లు బయటకుపోతాయి. ఫ్రీ ర్యాడికల్స్, టాక్సిన్ల వల్ల లివర్‌కు కలిగే నష్టం నివారించబడుతుంది. అలాగే చర్మాన్ని సంరక్షించే గుణాలు కూడా కరక్కాయలో ఉంటాయి. మొటిమలు, గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కరక్కాయ తగ్గిస్తుంది. కరక్కాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ఇలా కరక్కాయతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని పొడిగా చేసి కూడా ఉపయోగించవచ్చు. లేదా చిన్న ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ రసం మింగవచ్చు. ఇలా కరక్కాయను తీసుకుంటే పైన తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.