Revanth Reddy | ‘దేవాదుల పంప్‌హౌస్‌లన్నీ నడుపుతాం’.. ఇదీ వరంగల్ పర్యటన సందర్భంగా గత నెలలో రేవంత్ చేసిన ప్రకటన. కానీ ప్రస్తుతం పదిలో కేవలం నాలుగు పంపు లు మాత్రం నడుస్తున్నాయి. మిగతావి మొదలయ్యే సూచనలూ కనిపించడంలేదు. ఫలితంగా ఒకవైపు సాగునీరందక పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆందోళనకు దిగుతుంటే.. మరోవైపు సమ్మక్క బరాజ్‌నుంచి నీళ్లు దిగువకు వృథాగా పోతున్నాయి.
వరంగల్, మార్చి 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘దేవాదుల పంపులన్నీ నడవాల్సిందే. రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందే’.. ఇది గత నెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జారీచేసిన హుకుం. రెండు వారాలు గడువక ముందే సీఎం ఆదేశాలు, ఇచ్చిన హామీ గోదావరిలో కలిసిపోయాయి. సీఎం పర్యటన ముందురోజు వరకు ఆరు పంపులు నడిస్తే, ఇప్పుడు రెండు బంద్ అయినట్టు తెలిసింది. దేవాదులలో మొత్తం 10 పంపులకు గానూ 4 పంపులు మాత్రమే నడుస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం వచ్చినప్పుడు తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బరాజ్ గేట్లన్నీ మూసివేసి నీటిని నిల్వ చేయగా, ఇప్పుడు కొన్ని గేట్లను ఎత్తడంతో నీరు కిందికి వెళ్లిపోతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ‘తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినవారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తారా? పక్క రాష్ట్రం నీళ్లు తరలించుకుపోవటానికి ప్రభుత్వమే సహకరిస్తున్నదని కొందరు చౌకబారు ఆరోపణలు చేస్తున్నరు. అలాంటివాటిని మేం పట్టించుకోం’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. కానీ దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బరాజ్‌ల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, సీఎం స్వయంగా ప్రాజెక్టును సందర్శించి అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు అమలు కాకపోవడం, నీరు కిందికి వెళ్తుండటంపై వరంగల్ జిల్లా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి నదిపై ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 10 మోటర్లు ఉన్నాయి. ఫేజ్-1లో రెండు, ఫేజ్-2లో రెండు, ఫేజ్-3లో ఆరు మోటార్లు ఉన్నాయి. వీటిలో నడిచేది ఫేజ్-3లోని మోటర్లు మాత్రమే. ఈ ఆరు మోటర్లలో రెండు రామప్ప చెరువుకు, అక్కడినుంచి దేవన్నపేట పంప్‌హౌస్ దాకా పంపింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గత నెల 20న దేవన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలించిన తర్వాత ‘గోదావరిలో నీళ్లున్నా, రైతుల కన్నీళ్లకు రేవంత్ సర్కారే కారణం’ అని తీవ్ర విమర్శలు చేశారు. వీటికి సమాధానంగా 22న సీఎం రేవంత్‌రెడ్డి దేవాదుల ప్రాజెక్టును, సమ్మక్క బరాజ్‌ను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అప్పుడు సమ్మక్క బరాజ్‌లో నీటిమట్టం 77మీటర్లు.
సీఎం పర్యటనకు ఒక్క రోజు ముందు దేవాదులలోని ఆరు పంపుల ద్వారా 1,706 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. సమ్మక్క బరాజ్‌లోని మొత్తం 59 గేట్లను మూసివేశారు. చుక్క నీరు కిందికి వెళ్లలేదు. కానీ రెండు వారాలు గడువకముందే పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం నాలుగు పంపుల ద్వారా మాత్రమే 1,167 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్టు చెప్తున్నారు. బరాజ్‌కు ఉన్న మూడు (గేట్ నెంబర్లు 28, 50, 51) గేట్లను మొత్తంగా, మిగిలిన గేట్లను కొంత ఎత్తినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో బరాజ్ నుంచి దాదాపు 5వేల క్యూసెక్కుల నీరు యథేచ్ఛగా ఏపీకి తరలిపోతున్నదని పేర్కొంటున్నారు. ఇన్‌ఫ్లో తగ్గినప్పుడు నీటిని విడుదల చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బరాజ్ లెవల్ మెయింటేన్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నా, కిందికి వెళ్తున్న నీటి సంగతిని అధికారులు ధ్రువీకరించడం లేదు.
తెలంగాణ రైతుల కండ్లల్లో నీళ్లు పారించి, ఆంధ్ర ప్రాంత పంటలు పండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తున్నదని బీఆర్ఎస్ రెండేండ్లుగా ఆరోపిస్తున్నది. తాము చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. నిరుడు కాంట్రాక్టర్లకు రూ.8 కోట్ల మెయింటెనెన్స్ ఇవ్వకపోవటంతో దేవాదుల ప్రాజెక్టులో మోటర్లు ఆన్ చేయలేదు. ఫలితంగా వేలాది ఎకరాల పంటకు నీళ్లు అందక రైతులకు నష్టం వాటిల్లింది.
అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 45 రోజులు పోరాటం చేస్తేగానీ సర్కార్‌లో చలనం రాలేదు. ఈ సంవత్సరం కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలిచి, దేవన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలించిన మరునాడే ఆగమేఘాల మీద సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరుగులు తీసి చుక్కనీటిని కూడా దిగువకు పోనివ్వమని సీఎం ప్రకటించారు. కానీ 10 రోజుల తర్వాత క్షేత్రస్థాయిలో పంపులు బంద్ కావటం, యథేచ్ఛగా నీరు దిగువకు వెళ్లడం వంటి పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నదని రైతులు చెబుతున్నారు. సీఎం పర్యటన తర్వాత పరిస్థితి బాగుపడుతుందనుకుంటే మరింత దిగజారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.