Harish Rao |మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ నెలల తరబడి కొండలు పిండి చేసి భారీగా కాంక్రీటు తరలిస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నయి? విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనులశాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్టు? ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి?
-హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్‌లో పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తూ కొండలు పిండిచేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), హెచ్ఎండీఏ ఎందుకు అటువైపు చూడటం లేదని నిలదీశారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లు తొలుస్తూ, యథేచ్ఛగా వ్యాపారం చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే అక్రమం సక్రమమవుతుందా? అని నిప్పులు చెరిగారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
‘చట్టపరమైన అనుమతులు లేకుండా క్వారీ నిర్వహణ చట్టవిరుద్ధం అనే సంగతి ప్రభుత్వానికి తెలియదా?’ అని హరీశ్ ప్రశ్నించారు. టీఎస్ పీసీబీ నుంచి క్వారీ ఏర్పాటుకు అనుమతి లేదని (సీఎఫ్ఈ), కార్యకలాపాల నిర్వహణకు లైసెన్స్ (సీఎఫ్‌వో) లేదని చెప్పారు. పర్యావరణ అనుమతి కూడా లేదని పేర్కొన్నారు. మైనింగ్/క్వారీయింగ్ లీజ్ అనుమతిని మైన్స్, జియాలజీ విభాగం ఇవ్వలేదని తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ అనుమతి లేదని, ల్యాండ్ యూజ్ మార్పిడీకి హెచ్ఎండీఏ క్లియరెన్స్ ఇవ్వలేదని గుర్తుచేశారు. విస్ఫోటక పదార్థాల వినియోగ లైసెన్స్ కూడా లేదని, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవని, రెవెన్యూ అనుమతులు కూడా లేవని వివరించారు. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలు మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు-కాంక్రీట్ తరలించడం చట్టవిరుద్ధమనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు.
రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మరోవైపు ప్రభుత్వ భూమిని పప్పుబెల్లంలా తనవారికి కట్టబెడుతున్నారని హరీశ్ విమర్శించారు. తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్‌కు పిలువాలని ప్రధాన ప్రతిపక్ష సభ్యులుగా తాము డిమాండ్ చేస్తే మూడు రోజులైనా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకూపలుకూ లేకుండా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తున్నారని విమర్శించారు. ‘అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీయా?’ ప్రశ్నించారు.
‘ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించేవారెవరు?’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ‘తెలంగాణ అంటే బిజినెస్ అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్‌రెడ్డి అండ్ కో.. మీ ధనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా? ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములు అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలన్నా భూమి లేకుండా పోతుందని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నరు?’ అని నిలదీశారు.
‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని గొప్పలు చెప్పే హైడ్రాకు ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకుపోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు?’ అని హరీశ్ ప్రశ్నించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే పేదల ఇండ్ల మీదికి వెళ్లే హైడ్రా బుల్డోజర్లకు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? అని నిలదీశారు. సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా? అని కడిగిపారేశారు. ‘ఈ మైనింగ్ దందాలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్పై తక్షణ చర్యలు తీసుకోవాలి.
ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలి. ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలి. మీ అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా కట్టబెట్టిన 17 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపును వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రి పొంగులేటి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీకి సంబంధించిన ఫొటోలు, పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేశారు.
శని, ఆదివారాలు వచ్చాయంటే పేదల ఇండ్ల మీదికి వెళ్లే హైడ్రా బుల్డోజర్లకు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా?
–హరీశ్‌రావు
రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ భూమిని తనవారికి పప్పుబెల్లంలా కట్టబెడుతున్నడు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తున్నడు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీయా?
–హరీశ్‌రావు