Paddy crop | కోదాడ నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం మేజర్ ఆయకట్టు చివరి భూముల్లో పొట్ట దశలో ఉన్న వరి పంట సాగునీరు అందక ఎండిపోయే దశలో ఉంది. గత పది రోజుల నుండి ఈ మేజర్ ఆయకట్టు నుండి నీరు విడుదల కాకపోవడంతో తమ్మర గొండ్రియాల మంగలి తండా కొత్తగూడెం తండాతోపాటు చిమిర్యాల గ్రామాలకు చెందిన వరి పంట నీరందక ఎండిపోయే స్థితికి చేరుకుంది.
నాట్లు వేసిన నాటినుండి సరిపడా నీరందకపోవడంతో పంట పొలాల్లో నీరు నిల్వ లేకపోవడంతోపాటు ఓ పక్క ఎండలు దంచి కొడుతుండడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఆయకట్టు చివరి భూములలో పంట ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు వరి పంట పొట్ట దశలోనే ఉంది. నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే నీటిని విడుదల చేయకపోతే వరి చేతికందక ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పది రోజులపాటు సకాలంలో నీటిని విడుదల చేసి.. తమ సమస్య తీర్చాలని రైతులు కోరుతున్నారు.