N kodanda Reddy | ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎన్. కోదండ రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదని ,ఒకవేళ ఎవరైనా రైతులను రైస్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోదండ రెడ్డి హెచ్చరించారు. శనివారం రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రాలలోని ధాన్యపు రాశులు, తేమ, తాలు, తరుగు తదితర వివరాలను తెలుసుకోవడమే కాకుండా ధాన్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం రెండుచోట్ల రైతులు, హమాలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ధాన్యం సేకరణ పాలసీకి విరుద్ధంగా ఎవరు సేకరణ చేయకూడదని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, ఇందుకు సంబంధిత శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం ఉండరాదని ,కొనుగోలు కేంద్రంలో రైతు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు మాత్రమే సంబంధం ఉంటుందని, ధాన్యం అమ్మిన వెంటనే రైతుకు పక్కా రశీదు ఇవ్వాలని, అనంతరం రైతు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రం నుండి మిల్లులకు ధాన్యాన్ని పంపించిన తర్వాత మీల్లులకు వెళ్లాల్సిన బాధ్యత అధికారులదేనని, ధాన్యం విషయంలో రైస్ మిల్లర్ల పెత్తనం కుదరదని, గతంలో పద్ధతి చెల్లదని ఆయన స్పష్టం చేశారు. తాలు ,తరుగు ,తేమకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే రైతులు కొనుగోలు కేంద్రంలోనే పరిష్కారం చేసుకోవాలని, మిల్లర్లకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు.
శాస్త్రీయంగా మద్దతు ధర వచ్చేలా చూడాలి..
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం క్వింటాలకు 45 రూపాయలు మాత్రమే హామాలి చార్జీ తీసుకోవాలని, అంతకుమించి ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో ప్రజాప్రతినిధులు , అధికారులు రైతులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. ఎఫ్ సి ఐ గైడ్ లైన్స్ ప్రకారం రబీ ధాన్యం కొనుగోలు కు సంబంధించి తేమ, తరుగు వంటివి కొనుగోలు కేంద్రం లొనే ముందే చూసుకోవాలని, రైతుల సొంత ఖర్చులతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువస్తారని, తాలు, తరుగు పేరుతో వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని, శాస్త్రీయంగా మద్దతు ధర వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కాంటా వేయకముందు తాలూ, తరుగు, తేమ హమాలీ పేరుతో కొనుగోలు కేంద్రాలలో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై ఇలాంటివన్నీ ఉండడానికి వీలులేదని, ధాన్యం సేకరణ విధానాల ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఎవరైనా తేమ,తరుగు, తాలు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని అన్నారు. ఇకపై ఇలాంటి అన్ని ఆపివేయాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
కాగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తరుగు, తాలు, తూకం పేరిట అనవసరంగా మిల్లుల వద్ద లారీలను ఆపుతున్నారని, లారీకి 10 క్వింటాళ్ల చొప్పున తరుగు తీస్తున్నారని ,ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, రైతు సంక్షేమ కమిషన్ మెంబెర్ సెక్రెటరీ గోపాల్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి ,మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, డిఎస్ఓ, తహసిల్దార్ పరశురాం, మాజీ జెడ్పిటిసి గుమ్మలమోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆదర్శ రైతు రామిరెడ్డి, తదితరులు ఉన్నారు.
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!