Bollam Mallaiah Yadav | మునగాల, మార్చి 5 : రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా.. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వకుండా నట్టేట ముంచిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇవాళ మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను ఆయన రైతులతో పాటు కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ద్వారా రైతులకు రెండు పంటలకు నీళ్లు ఇస్తుంటే కంది, పెసర, మిర్చి, పత్తి పండించే మెట్ట రైతులు భూములను అచ్చుకట్టుకొని వరి సాగు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చాక వారబందీ ద్వారా రైతులకు నీళ్లు ఇస్తానని చెప్పడంతో వారి మాటలు నమ్మిన రైతులు వరిసాగు చేస్తే నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలన్నీ ఎండిపోయి అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులు కంటతడి పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనికరించే దుస్థితిలో లేదని మండిపడ్డారు. రైతాంగాన్ని, అన్ని వర్గాల ప్రజలను గాలికొదిలేసి అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిమయమైన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిన, దొడ్డి దారిన డబ్బులు ఎలా సంపాదించుకోవాలో అని ఆలోచిస్తుందే తప్ప రాష్ట్ర ప్రజలను పట్టించుకునే దుస్థితి లేదని ఆరోపించారు.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కోదాడ, హుజూర్నగర్ రెండు నియోజకవర్గాల ప్రజలు మా పిల్లలని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని.. ఎక్కడికక్కడ అడ్డుకుంటామని అవసరమైతే జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తొగరు రమేష్, అజయ్ కుమార్, సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు