రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ ( Devara Vinod ) కు క్రేజీ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (Crazy Star of the Year Award ) రావడం తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆలయ ప్రధాన అర్చకుడిగా (Chief Priest) దేవుడి సేవ చేసుకుంటూ మరొకవైపు సమాజ సేవ చేస్తూ ప్రశంసలు మన్ననలు పొందుతున్నాడు.
దేవర వినోద్ చేస్తున్న సేవలను గుర్తించిన క్రేజీ స్పోర్ట్స్, డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్రేజీ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మందమర్రి పట్టణంలో అందించారు. దేవర వినోద్ కు చిన్నతనం నుంచి సామాజిక సేవలో పాల్గొనడం, ఆపదలో ఉన్న వారిని తనవంతు సహాయంగా ఉంటూ అండగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో అంబలి ( Ambali ) పంపిణీ చేయడం, ఆలయంలో ప్రతి ఆదివారం అన్నదానం చేస్తూ భక్తులతో పాటు ప్రశంసలు పొందుతున్నాడు.
నిరుపేద కుటుంబాలకు చెందిన 13 జంటలకు సొంత ఖర్చులతో సామూహిక వివాహాలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా కరోనా సమయంలో వేల కుటుంబాలకు సరిపడా నిత్యవసర వస్తువులు కూరగాయలు అందించడంతోపాటు అన్నదానాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చాడు. ప్రతి సంవత్సరం నిరుపేదలకు వృద్ధులకు చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం తోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మందులు పంపిణీ చేయడం, ఉచిత పరీక్షలు , ఆపరేషన్లు , ఉచిత చర్మ, దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాడు.
గత పది సంవత్సరాలుగా నిరంతరం సామాజిక సేవలో పాల్గొంటున్న దేవర వినోద్‌కు పలు స్వచ్ఛంద సంస్థలు అవార్డులు అందించి సత్కరించాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు అమ్మ దయతో చేస్తూనే ఉంటానని దేవన వినోద్ నమస్తే తెలంగాణతో అన్నారు.