CPM | మిర్యాలగూడ, మార్చి 3 : ప్రస్తుత వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక చేసుకొని తాగు నీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. ఇవాళ స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు లేరని.. అధికారులే ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఎండలు విపరీతంగా కాస్తున్నాయని భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని.. దాని వలన తాగు నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే దూరపు ప్రాంతాలకు వెళ్లి గ్రామీణ ప్రజలు తాగునీటిని తెచ్చుకుంటున్నారని.. మున్సిపాలిటీలో మంచినీరు కొనుక్కుని తాగుతున్నారని చెప్పారు. అన్ని గ్రామాల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను వెంటనే శుభ్రపరిచి నీటితో నింపాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైపులైన్ మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉదయం, సాయంత్రం వేళలో మంచినీరు, తాగునీరు అందే విధంగా చూడాలన్నారు. మిషన్ భగీరథ నీళ్లు కూడా కలుషితంగా వస్తున్నాయని.. వాటిని శుభ్రపరిచి, శుద్ధిచేసి ప్రజలకు తాగునీరుని అందించాలని డిమాండ్ చేశారు.
గ్రామాలు, వార్డుల వారీగా అధికారులు బృందాలుగా ఏర్పడి తాగునీటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడే ఎండలు విపరీతంగా కాస్తున్నాయని భవిష్యత్తులో ఏప్రిల్ మే నెలలో ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారని.. దానికి అనుగుణంగా మంచినీటి సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో, వార్డులలో దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలన్నారు.
ప్రస్తుతం రంజాన్ నెల ఉపవాసాలు కొనసాగుతున్నాయని.. ఉదయం సాయంత్రం వేళలో మంచినీరు అందించడంతోపాటు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మసీదుల వద్ద ప్రతిరోజు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మూడవత్ రవి నాయక్, వినోద్ నాయక్, ఆయూబ్, అంజాద్, పాషా తదితరులు పాల్గొన్నారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు