సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో యాడ్ ఏజెన్సీల మాఫియా రెచ్చిపోతున్నది. నిబంధనలకు పాతర వేస్తూ అక్రమార్జనకు తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా, అవేవీ పట్టించుకోకుండా అడ్డగోలుగా ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ ఖజానాకు గండికొడుతున్నారు. ముఖ్యంగా వట్టి నాగులపల్లి, ముప్పా రోడ్డు, గోపన్పల్లి తండా ప్రాంతాల్లో గడిచిన కొన్ని రోజులుగా ఎలాంటి అనుమతులు లేని ప్రకటనల హోర్డింగ్లు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి.
జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఎటువంటి పర్మిషన్లు లేకుండానే వందలాది లాలిపాప్లు, భారీ కాంటిలివర్లు (హోర్డింగ్లు) వెలుస్తున్నాయి. వట్టి నాగులపల్లి నుంచి ముప్పా రోడ్డు వరకు, గోపన్పల్లి ఫె్లైఓవర్ సమీపంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 10 నుంచి 15 వరకు ఫౌండేషన్లు, నాలుగు చోట్ల ప్యానెల్ నిర్మాణాలు, సుమారు 400 నుంచి 500 వరకు కొత్త లాలిపాప్లు, 20 నుంచి 30 వరకు కాంటిలివర్లు అనధికారికంగా ఉండటం గమనార్హం. ఆర్అండ్బీ శాఖతో ఎంఓయూ ఉందంటూ పేర్కొంటూ జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండానే రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తుండడం, కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం విఫలం చెందడం పట్ల తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
తలా పాపం.. తిలా పిడికెడు
నగర శివారులో వెలుస్తున్న అనధికారిక హోర్డింగ్లు వెలవడం చూస్తుంటే జీహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతున్నది. విలీన మున్సిపాలిటీలలో ఎన్ని ప్రకటనల బోర్డులు అనధికారికంగా ఉన్నాయో? ఎన్ని అనుమతులున్నాయో, వాటికి ఎంత గడువుందో తెలియదు. అక్రమంగా ఏర్పాటైన ప్రకటనల బోర్డుల ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు, యూనిపోల్స్, లాలిపాప్స్, హోర్డింగు ఇలా అనేకవాటికి సంబంధించి రికార్డుల్లో ఉన్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్నవాటికి ఎక్కడా పొంతన ఉండడం లేదన్నది బహిరంగ రహస్యం .ఈ క్రమంలోనే ప్రకటన విభాగంలో భారీగా అవినీతి జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగా వట్టి నాగులపల్లి , ముప్పారోడ్డులో జీహెచ్ఎంసీకి సంబంధం లేకుండా, ట్యాక్సులు చెల్లించకుండానే 90 శాతం రోడ్లపై కేవలం మూడు, నాలుగు ఏజెన్సీలకే మేలు చేసేలా అధికారులు చక్రం తిప్పుతున్నారని, దీనివల్ల రూఫ్-టాప్ హోర్డింగ్లనే నమ్ముకున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నాయని బాధిత ఎజెన్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేని ప్రకటనలతో జీహెచ్ఎంసీ ఖజానాకు గండి పడటమే కాకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శేరిలింగంపల్లి సహా సిటీ శివార్లలోని అక్రమ హోర్డింగ్లను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.