పచ్చని అడవులపై ప్రకృతి ప్రకోపం!
రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న ములుగు జిల్లాపై ప్రకృతి ప్రకోపం చూపిస్తున్నది. రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి చోటుచేసుకున్న ఘటన ఏజెన్సీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. మంగళవారం మంగపేట మండలంలో ఎవరూ ఊహించని రీతిలో బీభత్సం సృష్టించిన టోర్నడో.. వేర్లతో సహా వందలాది చెట్లను పెకిలించించింది.
- ములుగు జిల్లాలో రెండేళ్లలో రెండోసారి టోర్నడో
- వేర్లతో సహా నేలవాలుతున్న భారీ వృక్షాలు
- హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా వరుస ఘటనలు
- వృక్ష సంపదకు అపార నష్టం
ములుగు, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న ములుగు జిల్లాపై ప్రకృతి ప్రకోపం చూపిస్తున్నది. రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి చోటుచేసుకున్న ఘటన ఏజెన్సీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. మంగళవారం మంగపేట మండలంలో ఎవరూ ఊహించని రీతిలో బీభత్సం సృష్టించిన టోర్నడో.. వేర్లతో సహా వందలాది చెట్లను పెకిలించించింది.
ప్రజలకు హెచ్చరిక జారీచేసినట్లుగా పచ్చని అడవిపై తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. రెండేళ్ల క్రితం తాడ్వాయి నుంచి మేడారంలో వెళ్లే దారిలో ఉన్న అడవిపై విరుచుకుపడగా, వందలాది ఎకరాల్లో వేలాది వృక్షాలు నేలమట్టం కాగా, ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. అలాగే మేడారం కేంద్రంగా భూకంపం సంభవించి రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించిన విషయం సైతం తెలిసిందే.
రెండేళ్లలో రెండోసారి..
తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే దారిలో 2024 ఆగస్టు 31న వచ్చిన టోర్నడో కారణంగా 500 ఎకరాల అడవిలో వేలాది భారీ వృక్షాలు నేలకూలగా, 16 విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కిలోమీటర్ల మేర వైర్లు తెగిపడ్డాయి. దీని తీవ్రతతో సమీపంలోని కొండపర్తి గ్రామంలోని కొన్ని ఇండ్ల పైకప్పులతో పాటు రేకులు ఎగిరిపోయాయి. ఎన్నడూ లేని విధంగా టోర్నడోతో భారీ నష్టం జరగగా, అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు పర్యావరణవేత్తలు, ప్రజా ప్రతినిధులు సందర్శించి జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. దీనిని మరువక ముందే 2024 డిసెంబర్ 4న మేడారం కేంద్రంగా భూకంపం సంభవించి రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా 232 కిలో మీటర్ల మేరకు ప్రకంపనలు వ్యాపించాయి.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. గత ఏప్రిల్ 22న మంగపేట మండలం కమలాపురంలో భారీ ఈదురు గాలులతో 105 విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ మూడు ఘటనలను ప్రజలు పూర్తిగా మర్చిపోకముందే ఈ నెల 28న మంగపేట మండల కేంద్రం నుంచి కోమటిపల్లికి వెళ్లే దారిలో టోర్నడో సంభవించి భారీ వృక్షాలు నేలవాలగా, జామాయిల్ ప్లాంటేషన్లోని చెట్లు సగానికి విరిగిపోయాయి. రెండుసార్లు టోర్నడోలు సంభవించిన సమయంలో భూమి నుంచి మేఘాలను తాకుతున్నట్లుగా సుడిగాలులు వచ్చి చెట్లను నేలమట్టం చేశాయని స్థానికులు చెబుతున్నారు.
దెబ్బతింటున్న జీవ వైవిద్యం
ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న వరుస సంఘటనలతో జీవ వైవిద్యం దెబ్బతింటున్నది. టోర్నడోలతో అపార నష్టం జరుగుతున్నప్పటికీ అధికారులు శాస్త్రీయ దృక్పథంతో నివారణ చర్యలు చేపట్టడం లేదు. టోర్నోడోల వల్ల వృక్షాలు మాత్రమే కూలిపోతున్నాయని అనుకుంటున్నారని, అడవుల్లో జీవిస్తున్న పక్షులు, సరీసృపాలు, క్రిములు, కీటకాలు, ఇతరత్రా జీవులు, వాటి మధ్య చెదిరిపోయిన సంబంధాలపై కూడా ఆలోచించాలని పర్యావరణ వేత్తలంటున్నారు.
అటవీ శాఖ అధికారుల సర్వే
మంగపేట : టోర్నడో కారణంగా మంగపేట మండల కేంద్రం సమీప సౌత్, నార్త్ అటవీ బీట్ల పరిధితో పాటు, జామాయిల్ ప్లాంటేషన్లో భారీ వృక్షాలు నేలకూలిన నేపథ్యంలో బుధవారం ఇన్చార్జి రేంజ్ అధికారి లాయిక్ హుస్సేన్ బృందం సర్వే నిర్వహించింది. మొత్తం 90 చెట్లు పూర్తిగా నేలమట్టం కాగా, 15 విరిగిపోయినట్లు గుర్తించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో అడవి లోపలున్న వివిధ బీట్లను పూర్తి స్థాయిలో పరిశీలించలేదన్నారు. వర్షం తగ్గాక డ్రోన్ సాయంతో అటవీ ప్రాంతమంతా పరిశీలించి, ఏ మేరకు వృక్షాలు పడిపోయాయో గుర్తిస్తామని హుస్సేన్ తెలిపారు. ఆయన వెంట డీఆర్వో సుజాత, బీట్ అధికారులున్నారు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

