Sapthami Gowda | సినిమా ప్రచార కార్యక్రమాలు, ఆడియో లాంచ్‌లు, అవార్డు వేడుకలు వంటి బహిరంగ వేదికల్లో హీరోయిన్ల వస్త్రధారణపై చర్చలు కొత్తేమి కాదు. అయితే ఇటీవల ఈ అంశం మరింత వివాదాస్పదంగా మారింది. ఒకవైపు సినీ రంగానికి చెందిన శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతుండగా, మరోవైపు కొంతమంది ఫోటోగ్రాఫర్లు, యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు హీరోయిన్లను అనుచిత కోణాల్లో చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అవసరం లేకపోయినా కెమెరాలను జూమ్ చేసి, మహిళా నటీమణుల శరీర భాగాలపై ఫోకస్ చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ధోరణులు పెరుగుతున్నాయని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళాకారిణుల ప్రతిభ కంటే వారి దుస్తులు, శరీరాకృతులపై దృష్టి కేంద్రీకరించే ఈ సంస్కృతి గౌరవప్రదమైన వాతావరణానికి భంగం కలిగిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులు బహిరంగంగా స్పందించారు. ముఖ్యంగా సప్తమి గౌడ ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంతార చిత్రంతో గుర్తింపు పొందిన ఆమె, తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మహిళా కళాకారులను కళాకారులుగానే చూడాలని, ఉద్దేశపూర్వకంగా జూమ్ చేసి అవమానకర కోణాల్లో చిత్రీకరించడం పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు. “మేము మా పనికోసం ఇక్కడ ఉన్నాం. అనవసరంగా జూమ్ చేసి చిత్రీకరించడం మా గౌరవాన్ని ఉల్లంఘించడమే” అంటూ ఆమె భావోద్వేగంగా స్పందించారు. #ActorsNotObjects అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ సమస్యను ఆమె ముందుకు తెచ్చారు.
సప్తమి గౌడ అభిప్రాయానికి రుక్మిణి వసంత్, ఆషిక రంగనాథ్ మద్దతు తెలిపారు. బహిరంగ కార్యక్రమాల్లో మహిళా నటుల ఫోటోలు, వీడియోలను అసభ్యకర కోణాల్లో చిత్రీకరించడం అసహ్యకరమని, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు. మీడియా, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు కళాకారిణుల వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని గుర్తుచేశారు. సోషల్ మీడియా విస్తరణతో సినీతారలకు అభిమానుల మద్దతు పెరిగినప్పటికీ, పాపరాజీ సంస్కృతి కారణంగా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత గోప్యత దెబ్బతింటోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సప్తమి గౌడ ప్రారంభించిన ఈ ఉద్యమానికి కన్నడ చిత్రసీమలోని పలువురు నటీనటులు సపోర్ట్‌గా నిలవడం గమనార్హం.