నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ముప్కాల్ మండలం పరిధిలో ఎస్సారెస్పీ వెనుక జలాల్లో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆదివారం సెలవురోజు కావడంతో స్నేహితులతో కలిసి వెళ్లిన పలువురు యువకుల్లో ముగ్గురు మృతిచెందగా.. ఒకరు గల్లంతయ్యారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఆదివారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ముప్కాల్ మండలం పరిధిలో ఎస్సారెస్పీ వెనుక జలాల్లో సరదా కోసం వీరిలో ఐదుగురు నీళ్లలోకి దిగారు. నీళ్లలో మునిగిన ఈ ఐదుగురిలో ఒకరిని స్థానికులు రక్షించారు. మిగిలిన నలుగురు నీళ్లలో మునిగిపోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.