Galikuntu vaccination | టేక్మాల్, నవంబర్ 11 : మెదక్ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 1,52,534 పాడి, పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం లక్ష్యంగా ముందుకెళ్లడం జరుగుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ వెంకటయ్య పేర్కొన్నారు. అందులో భాగంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో మంగళవారం జాతీయ పశువైద్య నియంత్రణ పథకంలో భాగంగా కుసంగి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.
ఈ కార్యక్రమం జిల్లాలో నవంబర్ 14వరకు కొనసాగుతుందని తెలిపారు. గాలికుంటు వ్యాధి పశువులలో వచ్చే అంటువ్యాధి అని, ఈ వ్యాధి వచ్చిన పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, అలాగే ఉత్పాదక శక్తి సైతం తగ్గిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. 3 నెలల పైబడిన పశువులకు, చూడి పశువులకు కూడా కచ్చితంగా టీకాలు ఇప్పించాలని తెలిపారు.
వ్యాధి వచ్చిన తరువాత చికిత్స కంటే నివారణే ముఖ్యమన్నారు. కాబట్టి పశు పోషకులు కచ్చితంగా తమ పశువులకు టీకాలు ఇప్పించాలని సూచించారు. మేలు జాతి పశు సంపద అభివృద్ధి, పశు గ్రాసం సాగు ప్రాముఖ్యత, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్త, పశుపాకల పరిశుభ్రత, దూడలలో నట్టల నివారణ వంటి విషయాలపై పశుపోషకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్య అధికారులు నాగరాజు, సౌమ్య, నాగార్జున పాటిల్, ప్రవీణ్, నిస్సీ జాయిస్, జూనియర్ వెటర్నరి అధికారులు హన్మంతు, సతీష్ కుమార్, సిబ్బంది కృష్ణ, పరమయ్య, గోపాలమిత్ర రవి తదితరులు ఉన్నారు.

Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం