Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలింగ్ బూత్‌ల్లోనే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. యూసుఫ్‌గూడ బూత్ నంబర్ 246లో, బోరబండ సైట్-3లో పోలింగ్ వద్దే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు, పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి పట్టుకున్నారు. దీంతో అడ్వకేట్ లలితారెడ్డినే వందలాది మంది కాంగ్రెస్ మూకలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేశారు.
ఈ ఘటనపై లలితా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండలో ఇష్టారాజ్యంగా పోలింగ్ కొనసాగుతోందని ఆమె తెలిపారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే షేక్‌పేట్ డైమండ్‌హిల్స్ కాలనీలోని అల్ఫాల్హా స్కూల్ బూత్‌లో రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెళ్లి పరిశీలించారు. వేరే ప్రాంతాల నుంచి బురఖాలో మహిళలను తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నట్లుగా గుర్తించారు.
ఓటర్ ఐడీ కార్డు లేకుండానే బురఖాలో వచ్చిన వారిని లోపలికి పంపించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐడీ కార్డు లేకుండానే పోలింగ్ బూత్‌లోకి ఎలా పంపిస్తారని ఆయన మండిపడ్డారు.