Bathukamma | రాయపోల్, జూన్ 21 : వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆకాశంవైపు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో విత్తనాలు వేసినప్పటికీ సరైన వర్షాలు లేక అవి మొలకెత్తడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురువాలని కోరుకుంటూ ముత్యంపేట గ్రామంలో మహిళలు శనివారం బతుకమ్మలు ఆడారు.
తమ పంటలు రక్షించుకోవడానికి వర్షాలు కురవాలని కోరుతూ మహిళలు పాటలు పాడుకుంటూ బతుకమ్మలు ఆడారు. రోహిణి కార్తి మొదలుతోనే వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలామంది రైతులు విత్తనాలు వేశారు. కానీ జూన్ మాసంలో సరైన వర్షాలు కురవక వేసిన పూర్తిస్థాయిలో మొలకెత్తడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
నైరుతి రుతుపవనాలతో ఈసారి వాన కాలంలో ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ సరైన వర్షాలు కురవడం లేదు. వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి విత్తనాలు వేశామని, తీరా విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు కురవడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే మేము వేసిన విత్తనాలు మొలకెత్తుతాయన్న ఆశతో రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్