సారంగాపూర్, జాన్ 21: దోమలకు అవాసంగా మురికి కాలువలు మారడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఏండ్ల తరబడి మురికి కాలువల్లో నీరు అలాగే ఉంచడంతో పాకురుపట్టి పచ్చగా మారిపోయాయి. దీంతో కాలనీ వాసులు అసలే వానకాలం వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఎంటని ఆందోళన చెందుతున్నారు. సారంగాపూర్ (Sarangapur) మండలంలోని రంగపేటలోని బతుకమ్మకుంట కాలనీలో ప్రధాన రహదారిపై నిర్మించిన మురికి కాలువల్లో నీరు బయటకు వెళ్లకుండా ఏళ్ల తరబడి కాలువల్లోనే నీరు ఉండడంతో దోమలకు అవాసాలుగా మారాయి.
రంగపేట గ్రామం నుంచి బతుకమ్మ కుంట వెళ్లే ప్రధాన రహదారి వర్షాలు కురిసినప్పుడల్లా రోడ్డంతా బురదమయంగా మారి రోడ్డుపై నడవాలంటే చెప్పులు చేత పట్టుకుని వేళ్ల ల్సిందేనని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగపేట నుండి ఆలూరు వరకు 2014, అక్టోబర్ లో తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్ అయినా ఇప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ వానాకాలం వెళ్లేవరకు తమకు ఇబ్బందులు తప్పవంటు గ్రామస్తులు, కాలనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలనీ నుంచి వెళ్తున్న మురికి కాలువ గ్రామ శివారు వరకు ఏర్పాటు చేయగా నీరు బయటకు వేళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే పేరుకుపోతున్నది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ చౌడారపు గంగాధర్‌ను వివరణ కోరగా వెంటనే మురికి కాలువలను పరిశీలించి కాలువల్లో పేరుకు పోయిన చెత్త చెదారాన్ని పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తామని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటమని పేర్కొన్నారు.