Upadi Hami| రాయపోల్, జనవరి 28 : ఉపాధి హామీ పథక అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఆర్డీఓ జయదేవ్ మాట్లాడుతూ.. కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా వారి జాబ్ కార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు.
గ్రామాల్లో నర్సరీలలో మొక్కల పెంపకానికి ఉమ్మడిగా బ్యాగ్ ఫిల్లింగ్ చేయాలని, వివిధ రకాల మొక్కలను పెంచాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. కూలీల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, కొన్ని గ్రామాల్లో కూలీల సంఖ్య తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో అందుబాటులో ఉండి ఉపాధి హామీ పథక పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతీ గ్రామంలో నర్సరీలతోపాటు అంతర్గత రోడ్లు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జయదేవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ శివకుమార్, ఏపీఎం యాదగిరి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mini Medaram | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మినీ మేడారం జాతర ప్రారంభం
Guava Vs Avocado | జామకాయలు.. అవకాడో.. మన ఆరోగ్యానికి అసలు ఏవి మేలు చేస్తాయి..?