నారీశక్తికి ప్రతీకలుఒకే బాధ్యతలో సుదీర్ఘకాలం కొనసాగడం జీవితంలో విజయమే! కానీ, ఒకే బాధ్యతలో ఒక జీవితకాలం సాగిపోవడం అతిగొప్ప విజయం. వృత్తిలోని ఆటుపోట్లకు జరిగిపోకుండా నిలకడగా నిలబడటం ఎంతో కష్టం. వ్యక్తిగత జీవితంలో ఒక మగువ.. మగాడిగా బతికింది. వృత్తిగత జీవితంలో ఓ అతివ అనితరసాధ్యమైన ఘనత వహించింది. సుదీర్ఘమైన జీవితాన్ని ఒక బాధ్యతకు అంకితం చేసి ఎందరికో జీవితపాఠం నేర్పిన ఈ ఇద్దరు అతివలు.. నారీశక్తికి చిరునామాగా నిలిచారు.
ఆమె ఒక మగాడు! టీ మాస్టర్ ముత్తు కుమార్ ఈ ప్రపంచం దృష్టిలో ఒక మగాడు. ‘ముత్తు అన్నాచీ (అన్నయ్యా) అని అందరూ ఆప్యాయంగా పిలిచేవాళ్లు. కానీ, తన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన నిజం ఏమిటంటే? ముత్తు ఒక స్త్రీ. తన అసలు పేరు పెచ్చియమ్మాల్. 36 ఏండ్లుగా సమాజంలో మగాడన్న గుర్తింపుతోనే బతికింది. ఒంటరి స్త్రీలను వేధించే సమాజంలో బిడ్డకు మంచి భవిష్యత్ కోసం ఆ తల్లి జీవన పోరాటమే ఈ మగాడి వేషం! తన బిడ్డ బంగారు భవిష్యత్ కోసం సగం జీవితాన్ని త్యాగం చేసిన ఓ తల్లి ప్రేమ కథ ఇది.
తూత్తుకుడిలో ముత్తు మాస్టర్ సుపరిచితమైన వ్యక్తి. రోడ్డు పక్కన టీ స్టాల్ నడపుతుంటాడు. ముత్తు అన్నాచీ అని అందరూ అతణ్ని గౌరవిస్తారు. కానీ, ముత్తు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? తాను ఒంటరి జీవితం వెనుక ఉన్న కథేమిటో ఎవరికీ తెలియదు. పెచ్చియమ్మాల్ జీవితం అందరిలాగే మొదలైంది. ఆమెది తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కట్టునాయకన్పట్టి గ్రామం. 20 ఏండ్లకు ఆమెకు పళ్లైంది. నెల రోజులకే ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటికే ఆమె కడుపులో ఓ కాయ కాసింది. తొమ్మిది నెలలు ఆ బిడ్డను మోసి కన్నది. ఆ పేదతల్లికి తన బిడ్డ షణ్ముగ సుందరి భవిష్యత్ మీదే ధ్యాస. తన కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. ఇల్లు గడవడానికి చేతిలో డబ్బు లేదు. బతుకుదెరువు కోసం దొరికిన పని చేయడానికి సిద్ధపడింది. తూత్తుకుడి పట్టణంలో, సమీప ప్రాంతాల్లో నిర్మాణ పనులకు కూలీగా వెళ్లింది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆమెపై కొందరి కన్ను పడింది. లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులు మొదలయ్యాయి. ఆ పని వదిలి ఇంకో పనికి చూసుకుంది. అక్కడా వెంటబడ్డారు. హోటళ్లలో పనికి కుదిరింది. అక్కడా వేధింపులే. ఎక్కడికి వెళ్లినా ఏ మగాడూ ఆమెలో బిడ్డ కోసం పరితపించే తల్లిని చూడలేదు! తమ కోరికను తీర్చే వస్తువుగానే భావించారు. లొంగదీసుకునే ప్రయత్నం చేశారు!! ఎవరికీ లొంగక, ఎక్కడా పనిలో నిలదొక్కుకోలేక పురుషాధిక్య సమాజంలో ఆమె బతుకు దుర్భరమైంది.
అజ్ఞాతవాసం
ఎక్కడికి వెళ్లినా… తనను అదోలా చూసే ఈ పురుష ప్రపంచంలో ఊళ్లు మారడం కాదు, పనులు మారడం కాదు.. తాను మారడమే పరిష్కారం అనుకుంది. స్త్రీ రూపాన్ని వదిలిపెట్టి పురుషుడి వేషం కట్టి… తన సమస్యకు పరిష్కారం కనుక్కున్నది. మగాడిగా జీవితం మొదలుపెట్టి కొత్త జీవితం ప్రారంభించింది. పెచ్చియమ్మాల్ కాస్తా.. ముత్తు కుమార్‌గా మారిపోయింది. జడ కత్తిరించుకుని మగవాళ్ల తలకట్టు చేయించుకుంది. చీర, రవికె వదిలేసి చొక్కా, లుంగీ కట్టడం ఆరంభించింది. ఆమెతో కలిసి పనిచేసేవాళ్లకు కనీసం అనుమానం రాకుండా మారిపోయింది. అలా పెచ్చియమ్మాల్ చెన్నై, తూత్తుకుడి రెస్టారెంట్లు, వీధుల పక్కన ఉన్న కాకా హోటళ్లలో పనులు చేస్తూ బతుకు వెళ్లదీసింది. టీ స్టాళ్లలో టీ మాస్టర్‌గా పనిచేస్తూ లారీలు, ఇతర వాహనాలు నడిపేవాళ్లతో ముత్తు అన్నాచీగా పిలుపించుకుంది. పెయింటర్‌గా, నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీగా, పరోటా మాస్టర్, టీ మాస్టర్‌గా అనేక పనులు చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లలో ఏ పని చెబితే ఆ పని చేసింది.
ఎన్నడూ దొరికిపోలే పనులు చేస్తున్న రోజుల్లో ముత్తు మగవాళ్ల మూత్రశాలలే వాడాల్సి వచ్చేది. బస్సు, రైలు ప్రయాణాల్లో మగవాళ్ల మధ్యే కూర్చోవాల్సి వచ్చేది. ఎక్కడైనా క్యూలో నిల్చోవాల్చి వచ్చినా, కూర్చోవాల్సి వచ్చినా మగవాళ్ల మధ్యనే ఉండాల్సి వచ్చేది. అసౌకర్యంగా ఉన్నా, తన గుర్తింపు బయటపడకుండా జాగ్రత్తపడింది. తన అసలు రూపాన్ని కప్పి ఉంచి 30 సంవత్సరాలు పురుషుడిగానే బతికేసింది. కేవలం తనతో కలిసి పనిచేసేవాళ్లకే కాదు బయటి ప్రపంచంలో తన ఐడెంటిటీని పూర్తిగా మార్చుకుంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, బ్యాంక్ అకౌంట్లలో ఆమె పేరు ముత్తు కుమార్‌గానే నమోదు చేసుకుంది. తన బిడ్డకు, అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులకు మాత్రమే తాను మగాడు కాదనే నిజం తెలుసు. మారుపేరుతో, మారువేషంలో జీవిస్తున్న సంగతి ఆ కొద్దిమందికే తెలుసు. ముత్తు కుమార్ అసలు స్వరూపం ఆమెకు ఆమెగా బయటపెట్టేవరకు మరెవరికీ తెలియలేదు.
కలలు తీరాక బిడ్డ బంగారు భవిష్యత్ కోసం పెళ్లి చేసుకోకుండా, స్త్రీ జీవితాన్ని కూడా వదిలేసి బతికిన పెచ్చియమ్మాల్ కష్టం ఫలించింది. తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. ఇక తన బాధ్యత తీరిపోయిందనుకుంది. ఇక మగాడి జీవితం అవసరం లేదని భావించింది. ముత్తుకుమార్గా అవతారం చాలింటి పెచ్చియమ్మాల్గా మారిపోయింది. ఇప్పుడు ఆమె వయసు 61 సంవత్సరాలు. మగ ప్రపంచంలోని ఉద్యోగాలు మానేసి ఊళ్లోనే పని చేసుకుంటున్నది. ఆమెకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ వచ్చింది. ఆ కార్డ్‌లో ఆమెను స్త్రీగా అధికారులు నమోదు చేశారు. పురుష ప్రపంచంలో ఒంటరి స్త్రీ ఎదుర్కొనే దారుణాలు ఎలాంటివో పెచ్చియమ్మాల్ జీవితం చెబుతుంది. ఆ సమస్యలను అధిగమించడానికి ఆమె తెలివిగా పురుషుడిగా మారింది! కానీ, ఆమె నిర్ణయం స్త్రీని కామవాంఛతో చూసే ఈ పురుషులకు చెంపపెట్టు. ఒంటరి తల్లిగా ఆమె చేసిన త్యాగం.. ఈ పురుషాధిక్య సమాజానికి గుణపాఠం.