Guava Vs Avocado | మన శరీరానికి జామ, అవకాడో రెండు కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి రెండు కూడా వేరు వేరు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జామకాయలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా జామకాయలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే అవకాడో కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అనేక రకాలుగా అవకాడో మనకు సహాయపడుతుంది. ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి బరువు తగ్గడంలో, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, శరీర ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాల పరంగా 100 గ్రాముల జామకాయలో 68 క్యాలరీలు, మన శరీర అవసరాలకు మించిన విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల అవకాడోలో 160 కిలో క్యాలరీలు, ఒలీక్ ఆమ్లం, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ విటమిన్స్ తో పాటు విటమిన్ కె, ఇ వంటి పోషకాలు ఉంటాయి. జామకాయలో తక్కువ క్యాలరీలతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు జామకాయ అనువైనది అయితే మెదడు, గుండె ఆరోగ్యానికి అవకాడో అనువైనది. కనుక మన శరీర అవసరాలకు తగినట్టు ఎంపిక చేసుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునే వారు జామకాయను తీసుకోవడం మంచిది. దీనిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరలు కూడా వేగంగా పెరగకుండా ఉంటాయి. ఇక అవకాడో ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దీనిలో 250 నుండి 300 క్యాలరీల వరకు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. కనుక దీనిని పావు లేదా అర ముక్క మోతాదులో మితంగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు అవకాడోను చిన్న మొత్తంలో తీసుకోవడం మంచిది.
అదే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో జామకాయ ముందు ఉంటుందని చెప్పవచ్చు. దీనిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి తెల్లరక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. జామకాయను తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు తగ్గడంతో పాటు కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో అవకాడో ముందంజలో ఉంటుందని చెప్పవచ్చు. దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో దాదాపు రెండు పండ్లు కూడా మనకు మేలు చేస్తాయి.
జామ, అవకాడో రెండు కూడా మనకు అనేక భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జామకాయ మనకు అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తుంది. అవకాడో కొద్దిగా ధర ఎక్కువగా ఉంటుంది. దీనిని అందరూ కొనుగోలు చేసి తీసుకోలేరు. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకునే వారు జామకాయను ఎంచుకోవడం మంచిది. గుండె ఆరోగ్యం కోరుకునే వారు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కోరుకునే వారు అవకాడోను తీసుకోవడం మంచిది. జామకాయను అల్పాహారంలో భాగంగా లేదా మధ్యాహ్నం రిఫ్రెష్ ఫ్రూట్ గా తీసుకోవచ్చు. భోజనం లేదా స్నాక్స్ గా అవకాడోను తీసుకోవచ్చు. మన శరీర అవసరాలను బట్టి మన ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.