సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఏటా మాదిరిగానే వచ్చే వర్షాకాలంలో నగరవాసులకు మళ్లీ వరద ముంపు తప్పదా? అంటే నాలా పూడికతీత పనుల్లో అధికారుల పనితీరు చూస్తే నగరవాసికి ముంపు కష్టాలు తప్పేలా లేవనిపిస్తోంది. సమ్మర్ ప్రారంభమైన నాలా పూడికతీత పనులు చాలా చోట్ల మొదలు కాలేదు..వాస్తవంగా ప్రతి డిసెంబర్లో నాలా పూడికతీత పనులను టెండర్లు పిలిచి మే నెలాఖరులోగా పనులను పూర్తి చేసి వర్షాకాలంలో వరద నీరు సాఫీగా సాగేలా చేయాల్సి ఉన్న అధికారులు నేటికి టెండర్ల దశలోనే కాలాయాపన చేస్తుండడం గమనార్హం.
వేసవిలో ప్రతి సారి సుమారు రూ.55 కోట్లతో 203 చోట్ల పనులకు శ్రీకారం చుట్టి వర్షాకాలం తొలకరి జల్లులు కురిసే నాటికల్లా పూడికతీత పనులను పూర్తి చేసి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలి..కానీ ఇప్పటి వరకు 125 చోట్ల మాత్రమే ఇటీవల పనులను ప్రారంభించగా..మిగిలిన చోట్ల టెండర్ దశ దాటలేదు..అనుకూలంగా ఉన్న సమయాన్ని వృథా చేసి..వర్షాకాలం ముంచుకొచ్చిన సమయంలో ఆగమేఘాల మీద పనులను తూతూ మంత్రంగా చేపట్టి పూడికతీత వందశాతం పూర్తయినట్లు రికార్డులు చూపించడం పరిపాటిగా మారుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిషనర్లు నాలా పూడికతీతపై ప్రత్యేకంగా సమీక్షించి పనులను వేగవంతం చేసేలా చొరవ తీసుకుని వర్షాకాల వరద ముంపు ప్రభావాన్ని తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు.
ఎందుకీ జాప్యం..?
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా…390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పునరుద్ధరణ, మరమ్మతులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పనులను సకాలంలో జరపకుండా వరద నీటి ముంపునకు అధికారులు కారణమవుతున్నారు. ముఖ్యంగా నాలా పూడికతీత ప్రక్రియను పారదర్శకంగా చేపట్టని ఫలితంగా ప్రతి సంవత్సరం వానాకాలంలో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునుగుతున్నాయి..ఈ విషయంలో ఇంజినీర్ల పనితీరుపై అనేక విమర్శలు వచ్చినా గుణపాఠం నేర్వడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
అప్పట్లో కిర్లోస్కర్ కమిటీ స్టడీ చేసిన పలు సిఫారస్సులను కూడా అమలు చేయడంలో జీహెచ్ఎంసీ ఘోరంగా విఫలమవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నా అప్పట్లో వరదల నివారణ కోసం కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తూ కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు తమ బినామీ సంస్థలకు పనులను అప్పగిస్తూ తుతూ మంత్రంగా చేపడుతూ ఏటా పూడిక పేరిట కోట్లాది రూపాయలు జేబులు నింపుకుంటున్నట్లు కూడా ప్రచారం సాగుతున్నది. ఈ క్రమంలోనే గత డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు మార్చి రెండో వారం వరకు కొన్ని చోట్ల టెండర్లతోనే కాలాయాపన చేసింది. ఇప్పటి వరకు నాలా పూడికతీత పనులన్నీ గ్రౌండింగ్లోకి వచ్చి దాదాపు 20 శాతం పూర్తి కావాల్సి ఉంది. కానీ చాలా చోట్ల పనులు ప్రారంభానికి నోచుకోకపోవడం ఇంజినీర్ల పనితీరుకు అర్థం పడుతున్నది.