కరకగూడెం, ఆగస్టు 05 : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కొమరం రాంగోపాల్(24) ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు పూనెం సందీప్ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై మంగళవారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి క్యానులో డిజిల్ నింపుకుని తిరిగి వెళ్తున్నారు. మార్గం మధ్యలో బైక్ వెనుక కూర్చున్న రాంగోపాల్ క్యాన్ జారిపోవడంతో కిందకి దిగాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుండి బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. వెంటనే సందీప్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి క్షతగాత్రుడిని తరలించారు.
బుధవారం ఉదయం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాంగోపాల్ యువకుడు మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే యువకుడి అకాల మరణంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాంగోపాల్ అన్నయ్య కొమరం సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపారు. కాగా గుర్తు తెలియని వాహనాన్ని వెంటనే గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. చేతికి అందిన కుమారుడు తమకు చేదోడువాదోడుగా ఉండే సమయంలో ప్రమాదంలో అకాల మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.