– నల్లగొండ కార్పొరేషన్లో రెండు వెట్టింగ్ మెషిన్లు ప్రారంభం
నీలగిరి, సెప్టెంబర్ 22 : నల్లగొండ కార్పొరేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే కాక బెస్ట్ కార్పొరేషన్ అవార్డు కూడా అందుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం ఇందిరాభవన్ వద్ద నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో పరిశుభ్రతకు సంబంధించి కోటి 1 లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు వెట్టింగ్ మెషిన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇటీవల నల్లగొండ కార్పొరేషన్ స్వచ్ఛ అవార్డు అందుకుందని, నూతనంగా ఏర్పాటైన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతున్నదని తెలిపారు. ముఖ్యంగా 24 గంటలు తాగునీరు అందించేందుకు రూ.83 కోట్లతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు.
నల్లగొండ కార్పొరేషన్లో ఎస్ డి ఎఫ్ నిధులతో 63 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని, అలాగే తక్కిన డివిజన్లలో కూడా రోడ్లతో పాటు, డ్రైన్లు నిర్మిస్తామని, 6 నెలల్లో ఎస్టీపీ పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నల్లగొండ కార్పొరేషన్‌కు అన్ని రకాల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేసి ఉత్తమ కార్పొరేషన్ అవార్డు తీసుకుంటామనే నమ్మకం తమకున్నట్టు మంత్రి తెలిపారు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, అలాగే డ్రైనేజీ, ఎస్ టి పి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ, ఆర్ అండ్ బి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.