IIT Bombay : ఐఐటీ బాంబే హాస్టల్లో సాహిల్ వాకోడే అనే విద్యార్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఐఐటీ బాంబే అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్లోని అన్ని గదుల్లో సీలింగ్ ఫ్యాన్స్ తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలు గదుల నుంచి సీలింగ్ ఫ్యాన్లు తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్‌మౌంటెడ్ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తోంది.
విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నట్లు ఐఐటీ బాంబే యంత్రాంగం తెలిపింది. గత వారం, హాస్టల్ నెంబర్ 4లో సాహిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ అంశంపై వివాదం నడుస్తోంది. ఇక్కడి విద్యార్థులతోపాటు అనేక విద్యార్థి సంఘాలు సాహిల్ మృతికి నిరసనగా ఆందోళనకు దిగాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రొఫెసర్, డీన్ సూర్య నారాయణను డైరెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే, డైరెక్టర్ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
సీసీటీవీ దృశ్యాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సాహిల్ పరీక్ష రాసిన గదికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45 వరకు ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో అది. అనంతరం పరీక్ష హాల్ నుంచి అతడు హాస్టల్‌కు వెళ్లిపోయాడు. చివరగా మధ్యాహ్నం 1.25 గంటలకు సాహిల్ హాస్టల్లోని తన గదిలోకి వెళ్లడం అక్కడ రికార్డైంది. అనంతరం అతడు బయటికి రాలేదు. ఆత్మహత్య చేసుకున్నాడు.