Karnataka : కర్ణాటక (Karnataka) లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు యాద్గిర్ జిల్లా (Yadgir district), సైదాపూర్ (Saidapur) పరిధిలోని కడేచూర్-బడియాలా (Kadechur-Badiyala) పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
దాదాపు రెండు గంటల ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు అకస్మాత్తుగా లీక్ అయ్యింది. డ్యూటీలో ఉన్న ముగ్గురు కార్మికులు ఆ వాయువు కారణంగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతులను విక్రమ్, సంజయ్, గణేష్‌గా గుర్తించారు. సంజయ్, విక్రమ్‌లది మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లా కాగా.. గణేష్‌ది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ అనే మరో ఇద్దరు కార్మికులు రసాయన వాయువు పీల్చటం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వారిని వెంటనే రాయచూర్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. సైదాపూర్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.