Pakistan: వరుస దాడులతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్లో మరోసారి దాడి జరిగింది. శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన పాక్, ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని, డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శనివారం జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామే అని టీటీపీ (తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్) అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. పాక్ పోలీసులు వెల్లడించిన వివరాలివి.
ఆత్మాహుతి పాల్పడేందుకు సిద్ధమైన ఒక ఉగ్రవాది భారీ పేలుడు పదార్థాలున్న వాహనంతో రోడ్డు పక్కన ఉన్న ఒక పోలీస్ చెక్‌పోస్టు వద్దకు దూసుకొచ్చాడు. అనంతరం తనను తాను పేల్చుకున్నాడు. ఇదే సమయంలో వాహనంలో ఉన్న పేలుడు పదార్థాలు కూడా ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో భారీ పేలుడు సంభవించి 11 మంది మరణించగా.. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు.
Aman Mela, Darazind, Dera Ismail Khan KPK PAKISTAN
12 killed and 30+ injured in a blast, security personnel are also among casualties. pic.twitter.com/3Y16yTDjHD
— War & Gore (@Goreunit) September 26, 2026
గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడు ధాటికి భారీగా పొగ వెలువడటం, చుట్టుపక్కల ప్రదేశాలు భారీగా ధ్వంసం కావడం వీడియోల్లో కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో వరుసగా పాకిస్తాన్లో పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి.