అమరావతి : అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు( Chandra Babu ) ఘనపాటి అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. రెండేళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని ట్విటర్లో అభివర్ణించారు. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక అని ఆరోపించారు. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం, అభివృద్ధి బూటకం, సంపద సృష్టి మోసం, సమతుల్యత పచ్చి అబద్ధం, సంక్షేమం టోకరా అని పేర్కొన్నారు.
విధ్వంసం నుంచి అగాధంవైపు, అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు కూటమి పాలన కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు ఉద్ధరించింది శూన్యమని ఆరోపించారు. భరోసా పేరుతో సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాట తప్పారని విమర్శించారు.
3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ కి రూ.4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 10 వేల కోట్లు బకాయిలు పెట్టి, 6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లిందని ఆరోపించారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున, అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లని ప్రశ్నించారు.