Hit And Run : బాచుపల్లిలో హిట్ అండ్ రన్ కారణంగా ఓ ఆయుర్వేద థెరపిస్ట్ దుర్మరణం చెందాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కేరళకు చెందిన అనాస్ ఎం ఎస్ (23) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఆర్ఎంసీ వాహనం ఢీ కొట్టడంతో.. ఇద్దరు కిందపడ్డారు. ఆర్ఎంసీ వాహనం వెనక టైర్లు అనాస్ తల మీదుగా వెళ్లడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హిట్ అండ్ రన్ కేసులో దుర్మరణం చెందిన అనాస్ ఎంఎస్ నగరంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో థెతెరపిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తన మిత్రుడు అశ్విన్‌తో కలిసి అతడు సరదాగా ద్విచక్ర వాహనం(స్కూటీ)పై రైడ్‌కు బయలుదేరాడు. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మీదుగా ప్రగతి నగర్ ఓవర్సీ హోటల్ వైపు వీరు వెళుతుండగా.. ప్రగతి నగర్‌లోని మూడు కోతుల బొమ్మల చౌరస్తా వద్ద గుర్తు తెలియని ఆర్ఎంసి వాహనం ఢీకొట్టింది. దాంతో, అదుపుతప్పి వీరి స్కూటీ కింద పడిపోయింది. రోడ్డుపై పడిపోయిన అనాస్ తలపై నుంచి ఆర్ఎంసి వాహనం వెనుక టైర్లు దూసుకెల్లడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయినప్పటికీ డ్రైవర్ వాహనం ఆపలేదు. అశ్విన్ ఫిర్యాదు మేరకు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు.