హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 4: ‘సర్’ పేరుతో ఓటు హక్కును కాజేయొద్దని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhasker) ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు. భారత ఎన్నికల ప్రక్రియలో మైనారిటీల స్థితిగతులు, ఓటు హక్కు, రాజకీయ ప్రాతినిధ్యం, ఎన్నికల జాబితాల సవరణ తదితర అంశాలపై హనుమకొండలోని జకారియా ఫంక్షన్ హాల్లో ‘ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్(ఇనామ్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ఉండాలే తప్ప అర్హులైన పౌరుల్లో అనుమానాలు, భయాందోళనలు కలిగించే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా తమ ఓటును కోల్పోయే పరిస్థితి రాకూడదని ఆయన తెలిపారు. ఓటు హక్కు అనేది ఎన్నికల్లో పాల్గొనేందుకు మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యంలో పౌరుల గొంతు అని వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. ముస్లిం, మైనారిటీలతో పాటు ఇతర మత, సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన వారికి తమ పేర్లు ఓటర్ల జాబితాలో సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించుకునే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, మైనారిటీ సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాలని వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
అనంతరం ప్రముఖ భారతదేశ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ‘భారతదేశ ఎన్నికల విధానం-మైనార్టీ ప్రజల స్థితిగతులు’ అనే అంశంపై సభికులకు సవివరంగా వివరించారు. ఇనామ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మోటూరి కృష్ణప్రసాద్ సంస్మరణ సందర్భంగా నిర్వహించిన ఈ సదస్సులో ఇనామ్ జాతీయ సమన్వయకర్త మహమ్మద్ ఆయుబ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జుబేర్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్(ఎన్డీ) నుంచి భిక్షపతి, జ్యోతి, ప్రభాకర్‌రెడ్డి, గోవర్ధన్, ఇతర ప్రజాసంఘాల నాయకులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మజీద్, మున్నా, పర్వేద్, అప్పారావు, రాజమొగిలి, అస్లాం, సుభాన్సాబ్, సిరాజ్, చక్రపాణి, రాజమహమ్మద్, అలీం, మొయిజ్, సర్దార్జీ, పాస్టర్ బాబురావు, బోడ డిన్నా, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.