హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో ‘కొందరు ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నది. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించినా.. చేతల్లో మాత్రం తూతూ మంత్రమే అనిపిస్తున్నది. రాష్ట్రంలోని ఓ మంత్రి వద్ద కీలకంగా వ్యవహరిస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. తనకు తాను రెండు శాఖలు చూస్తున్న మంత్రికి షాడోగా వ్యవహరిస్తున్న ఆయన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. గతంలోనే ఆయన చర్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అటవీ శాఖలో ఎవరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలన్నా, ఎవరికి ఏ పని కావాలన్నా.. ఆ షాడోను కలిస్తేనే పని అయ్యేది. అలాంటిది డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో తలదూర్చడంతో ఆ ఓఎస్డీ పదవి ఊడింది. ప్రభుత్వంతో దూరంగా ఉండాలని కూడా ఆనాడు హెచ్చరికలు వెళ్లాయి. వివాదాలు ఎక్కువ కావడంతో కొంతకాలం చాటుగా ఉన్న ఆ షాడో మంత్రి మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. దర్జాగా పనులు చక్కపెడుతున్నాడు. 6 నెలల క్రితమే పక్కన పెట్టినట్టు ప్రచారం జరిగినా.. మళ్లీ ప్రత్యక్ష్యం కావడంపై అటవీశాఖ అధికారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
ఆ షాడో మంత్రికి ఇటీవల అటవీశాఖలోని కాంట్రాక్టులపై దృష్టిపడింది. వీటిలో దూరాలని భావించిన ఆయన ఇటీవల ఆ శాఖ పెద్ద మనిషితో ఆకస్మిక తనిఖీలు పెట్టించారు. నగర శివారులోని ఓ రిసార్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అటవీ శాఖకు చెందిన ఆ రిసార్ట్ ఇప్పటికే ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చారు. రెండు నెలల్లో ఆ లీజు ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ లీజు వ్యవహారాన్ని ‘సర్దుబాటు’ చేసుకోవాలన్న లక్ష్యంతో ఆ షాడో మంత్రి ఉన్నట్టు సమాచారం. తనకు అనుకూలమైన వ్యక్తులకు లీజు దక్కేలా చేసేందుకు ఈ తతంగం నడిపినట్టు తెలుస్తున్నది.
ఇటీవలే నగరంలోని ప్రముఖ ఆలయంలో కూడా తనిఖీలు నిర్వహించేలా సదరు శాఖ పెద్ద మనిషిని ఆ షాడో మంత్రి ఒప్పించారు. దీని వెనుక ఢిల్లీలో ఓ ఏఐసీసీ పెద్ద ఆశీస్సుల కోసం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య సిఫార్సు లేఖలను పూర్తిగా ఆమోదించేలా చూడాలని, స్థానిక ఎమ్మెల్యేకన్నా.. ఇక్కడ ఉన్న ఏఐసీసీ నేత భార్య సిఫార్సులే చెల్లుబాటయ్యేలా చూడాలన్న ఉద్దేశంతో ఆ తనిఖీలు చేయించి స్థానిక అధికారులను భయభ్రాంతులకు గురిచేశారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా మంత్రికి సమానంగా తనకూ కుర్చీ వేయాలని అధికారులను ఆ షాడో మంత్రి వేధిస్తున్నట్టు తెలిసింది. గతంలోనే ఈయన బాధ పోయిందనుకొంటే మళ్లీ ఊడిపడ్డాడని అధికారులు వాపోతున్నారు.