మోర్తాడ్, మార్చి 10: విత్తన వ్యాపారుల సిండికేట్ మళ్లీ జూలు విదిల్చుతున్నది. ఎర్రజొన్న ధరను అమాంతం తగ్గిస్తూ అన్నదాతను ఆగం జేస్తున్నది. వ్యాపారుల సిండికేట్ దెబ్బకు రైతాంగం విలవిల్లాడుతున్నది. వ్యాపారులు కూడబలుక్కుని ధర తగ్గిస్తుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. సిండికేట్ కారణంగా ఎర్రజొన్న ధర వారం వ్యవధిలోనే రూ.500 దాకా పతనమైంది. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మొన్నటిదాకా క్వింటాల్‌కు రూ.3,900 పలికిన రేటు ఇప్పుడు రూ.3,450కి చేరడంతో దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సిండికేట్ ఆట కట్టించాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యాపారులను నియంత్రించడంతో జొన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. కానీ కాంగ్రెస్ సర్కారు ఎర్రజొన్న కొనుగోళ్లపై దృష్టి సారించక పోవడంతో వ్యాపారులు మళ్లీ రెచ్చిపోతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో చెక్..
గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎర్రజొన్న వ్యాపారుల ఆగడాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థవంతంగా నియంత్రించింది. సీడ్ ఇచ్చే వ్యాపారి లేదా కంపెనీ ముందుగానే రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకునేలా చర్యలు చేపట్టింది. సీడ్ ఇచ్చే సమయంలోనే ధర ఖరా రు చేయాలని, ఒప్పందం ప్రకారం అదే ధరకు ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించడంతో బీఆర్ఎస్ హయాంలో ప్రశాంతంగా కొనుగోళ్లు సాగాయి. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఎర్రజొన్నల అంశాన్ని పట్టించుకోక పోవడం వ్యాపారులకు వరంగా మారింది. బైబ్యాక్ ఒప్పందాలు లేకపోవడం, విత్తనాలు మాత్రమే ఇస్తామని, పంట ఎవరికైనా అమ్ముకోవాలని వ్యాపారులు రైతులకు చెబుతుండడంతో పరిస్థితి మొదటికొచ్చింది. మరోవైపు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తున్న తరుణంలోనూ సర్కారు స్పందించక పోవడంపై అన్నదాతల్లో ఆగ్రహం వెల్లవెత్తుతున్నది.
కూడబలుక్కుని..
సిండికేట్‌గా మారిన సీడ్ వ్యాపారులు ధరలను తగ్గించేస్తున్నారు. వారం క్రితం క్వింటాకు రూ.3,800-3,900 దాకా చెల్లించిన వ్యాపారులు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. రెండ్రోజుల క్రితం కమ్మర్‌పల్లిలో రూ.3,600 చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడేమో రూ.3,400 మాత్రమే చెల్లిస్తామని, లేకపోతే కొనేది లేదని తేల్చి చెబుతున్నాని రైతులు వాపోతున్నారు. వారం వ్యవధిలోనే రూ.500 దాకా ధర తగ్గించేశారని ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల మాయాజాలం కారణంగా జొన్నలు కల్లాలు దాటడం లేదు.
తగ్గిన విస్తీర్ణం..
రాష్ట్రంలో అత్యధికంగా ఎర్రజొన్న సాగయ్యేది ఆర్మూర్ డివిజన్‌లోనే. ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా దీన్ని సాగు చేస్తారు. గతంలో 40 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఎర్రజొన్న వేసే వారు. అయితే, ఈసారి రైతులు మక్క వైపు మళ్లడంతో 23 వేల ఎకరాల్లోనే పంట సాగయింది. మరోవైపు, ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. వాస్తవానికి ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దాకా దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి 15-16 క్వింటాళ్లకే పరిమితమైంది. పంట విస్తీర్ణం తగ్గడంతో మంచి ధర వస్తుందని రైతులంతా ఆశించారు. అదే సమయంలో దిగుబడి పడిపోవడంతో డిమాండ్ పెరిగి ధర పెరుగుతుందని ఆశించారు. కానీ, రైతుల ఆశలపై వ్యాపారులు నీళ్లు చల్లారు. అంతా ఏకమై ధరను నియంత్రిస్తున్నారు.
సిండికేట్‌ను నియంత్రించాలి..
ఎర్రజొన్న వ్యాపారుల సిండికేట్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రైతులకు మద్దతు ధర చెల్లించేలా చర్యలు చేపట్టాలి. బైబ్యాక్ ఒప్పందం విధానాన్ని తిరిగి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పంట కోతలు ప్రారంభమైన సమయంలో ధర చెల్లిస్తారు. ఆ తర్వాత క్రమంగా తగ్గిస్తూ వస్తారు. దీంతో చివరగా అమ్ముకునే రైతు నష్టపోవాల్సిన పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు సరైన ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– ముత్యాల లక్ష్మణ్, రైతు, దోన్పాల్
పడ్డకష్టానికి ధర వస్తేనే ఫలితం
పంట పండించేందుకు పడ్డ కష్టానికి మం చి ధర వస్తేనే ఫలితం దొరుకుతుంది. కానీ ఎర్రజొన్నలను పండించి నష్టపోవాల్సి వస్తున్నది. రెండ్రోజుల కింద క్వింటాలు రూ.3600లకు అమ్మినం. ఇప్పుడేమో రూ.3,450 మాత్రమే ఇస్తామని అంటున్నరు. పైగా సంచికి రెండు కిలోల కడ్త తీస్తరు. ఇట్లయితే రైతులు బతికేదెట్ల? వ్యాపారులు రాక పంట మొత్తం కల్లాల్లోనే ఉంచుతున్నం. ప్రభుత్వం, అధికారులు స్పందించి సరైన చర్యలు తీసుకోవాలి.
– సంత చిన్నరాజేశ్వర్, రైతు, కమ్మర్పల్లి