Bhadradri Kothagudem | ఆళ్లపల్లి, ఆగస్టు 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జల్లేరు, కిన్నెరసాని, కోడెల, తునికిదున్నే వాగులతో పాటు పలు చిన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
కొత్తగూడెం–మర్కోడు–ఆళ్లపల్లి ప్రధాన రహదారిపై అనిశెట్టిపల్లి గ్రామ శివారులోని పుణ్యపు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు ఉప్పొంగడంతో అక్కడికి చేరుకున్న ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లలేక నిలిచిపోయింది. ఫలితంగా జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాల నేపథ్యంలో మండలంలోని వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరించారు.
గర్భిణులు, బాలింతలు లేదా అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారు వాగులు దాటాల్సిన పరిస్థితి ఉంటే ముందుగానే పోలీసు శాఖ లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.