Urea | రాయపోల్, జులై 12 : యూరియా కోసం రైతులు నిత్యం అరిగోస పడుతున్నారు. మొక్కజొన్న పంటకు యూరియా అవసరం ఉండడంతో రైతులు ఆగ్రోస్. పీఏసీఎస్‌ల వద్ద పడికాపులు కాస్తూ పనులు వదులుకొని యూరియా బస్తాల కోసం నానా తంటాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం 560 యూరియా బస్తాలు రాగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో యూరియా ఇవ్వడానికి సిబ్బందికి తలనొప్పిగా మారింది.
ఒక రైతుకు రెండు బస్తాలు ఇవ్వడంతో తమకు ఎలా చాలుతుందని సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు క్యూ లైన్లో నిల్చుని గంటల తరబడి ఎలా నిలబడాలని పెద్దపెట్టున నినాదాలు చేయడంతో పీఏసీఎస్ సిబ్బంది ఏమి చేయాలో తెలియకపోవడంతో కొద్దిసేపు నిలిపివేశారు. అటువైపు వెళుతున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి వారిని క్యూ లైన్లో నిలుచుండబెట్టి ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలని పేర్కొనడం కనిపించింది.
పొద్దంతా వేచి ఉండాల్సిన దుస్థితి….
గతంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని ప్రస్తుతం యూరియా కొరత వలన తాము పనులు వదులుకొని రెండు బస్తాల యూరియా కోసం పొద్దంతా వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పోలీస్ పహారాలో యూరియాను పంపిణీ చేశారు. చాలామందికి అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ వెనుదిరిగి వెళ్లారు. అలాగే దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ సెంటర్‌కు 500 యూరియా బస్తాలు రావడంతో అక్కడ కూడా క్యూలైన్ ద్వారా నిలబడి పనులు వదులుకొని యూరియా బస్తాలను రైతులు తీసుకున్నారు.
యూరియాను అందుబాటులో ఉంచాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా శనివారం దౌల్తాబాద్ మండలానికి పిఎసిఎస్. అగ్రోస్ సెంటర్లకు మొత్తం 1060 పస్తాల యూరియా వచ్చిందని వాటిని రైతులకు ఇవ్వడం జరిగిందని వ్యవసాయ అధికారి సాయికిరణ్ పేర్కొన్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి